రథోత్సవం అనగా రథంపై దేవుని ఊరేగించడం. రథోత్సవంను రథ యాత్ర అని కూడా అంటారు. రథోత్సవం జరిగే ముందుగా దేవ ఉత్సవ విగ్రహలకు కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణోత్సవం తరువాత స్వామి వారు సతీ సమేతంగా అత్తవారింటికి రథంపై ఊరేగింపుగా వస్తున్నట్టు ఈ ఉత్సవాన్ని భక్తజనులు ఆనందంగా జరుపుకుంటారు.జనన్నాథ రథ యాత్ర – పూరీరథోత్సవం నాడు రథంను బాగా అలంకరిస్తారు, రథంను భక్తులు లాగేందుకు రథానికి మోకు కడతారు. రథయాత్ర ప్రారంభ పూజలు తరువాత జయజయధ్వనాలతో రథయాత్ర నిర్వాహకుని సూచనల మేరకు మోకులను పట్టుకుని భక్తులు రథాన్ని కదలిస్తారు.
రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు, నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం (జులై 17) లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి ‘మనిమా’ (జగన్నాథా…) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని ‘పహండీ’ అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా… ‘ఇలపై నడిచే విష్ణువు’గా గౌరవాభిమానాల్ని అందుకునే పూరీ రాజు పల్లకీలో అక్కడికి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే ‘చెరా పహారా’ అంటారు.