యుగానికి ఆదిగా జరుపుకునే పండగ ఉగాది. దీనిని సంవత్సరాది అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగను తెలుగు వారు జరుపుకుంటారు.

ఎప్పుడు వస్తుంది

చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాస శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం Apr 6, 2019 న జరుపుకుంటారు.

ఏమి చెయ్యాలి

ఈ పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పిల్లలు,పెద్దలు శాస్త్ర విధిగా తలంటు స్నానం,నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. నుదుట బొట్టును పెట్టుకుని, కొత్త బట్టలు వేసుకుని తరువాత భగవంతుడిని పూజించాలి. పూజ అయిన తరువాత పెద్దల దీవెనలను పొందడం, పంచాంగశ్రవణం, దేవాలయాల సందర్శనం చేస్తే పుణ్యఫలాలు కలుగుతాయి.

ఉగాది పచ్చడి

ఉగాది రోజు ప్రత్యేకం పచ్చడి. ప్రకృతి నుండి అప్పుడప్పుడే కొత్తగా వచ్చే కాయలు, పూతలు వీటి ద్వార చేసేవి

  1. వేప పువ్వు “చేదు”
  2. మామిడి “వగరు”
  3. కొత్త బెల్లం “తీపి”
  4. కొత్త చింతపండు “పులుపు”
  5. మిర్చి “కారం”
  6. ఉప్పు “కటువు”

ఈ షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ముందుగా దేవుని ముందు నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత పరిగడుపున తినడం జరుగుతుంది. ఈ ప్రకియంతా శ్రద్ధగా గమనిస్తే ఈ కాలంలో వచ్చే కాయలను పండ్లను తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనకు శాస్త్రాలు సూచిస్తున్నాయి. తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజు అన్ని రకాల రుచులను సమభావదృష్టి గ్రహించే పరమార్ధం ఏమిటంటే మానవుడు తన జీవితంలోని సుఖదుఖాలను, మంచి,చెడులను సంతోషంగా ఎదుర్కోవాలి అని. మనిషికి కష్టం కలిగినపుడు కృంగక, మంచి జరిగినపుడు గర్వపడక రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జీవితం సాగించాలని భావం.

ఇంకా ఏంచేస్తారు

ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం వినడం ఆంతర్యం ఎమిటంటే ఉగాది అనేది చైత్రశుద్ధ పాడ్యమితో ప్రారంభం అవుతుంది. ఖగోళంలో ఉన్న గ్రహాల స్థాన ప్రభావ ఫలితంగా మన మహర్షులు తెలిపిన ప్రకారం పన్నెండు రాశులు, 27 నక్షత్రాలను ప్రామాణికంగా తీసుకొని కాల గణనం చేస్తూ వస్తున్నాము. అందుకు ఈ నూతన తెలుగు సంవత్సరాది నాటి నుండి సంవత్సర కాలం పాటు వ్యక్తి జాతక రాశి జన్మనామం ఆధారంగా గోచార గ్రహా ఫలితాలు ,ఆ సంవత్సరంలో జరగబోయే మంచిచెడులు, వర్షపాతం, రైతులకు ఏ పంటలు పండిస్తే లాభాలు కలుగుతాయి, తాను,కుటుంబం,దేశం సుభిక్షంగా ఉండాలంటే గ్రహస్థితి గతులను ఆధారంగా తరుణోపాయాలను తెలుసుకోవడాని అవకాశం ఉంటుంది. ఈ పంచాంగ శ్రవణం ద్వారా, జరగబోయే విపత్తులనుండి ముందే తెలుసుకుంటాము. కాబట్టి శాస్త్రాన్ని నమ్మిన వారికి వారి వారి వ్యక్తిగత జాతక ఆధారంగా కొంత ముందస్తుగా జాగ్రత్త పడే అవకాశం అభిస్తుంది. త్రేతాయుగం, ద్వాపర యుగ కాలం నుండి మొన్నటి రాజుల కాలంతో సహా పంచాంగ శ్రవణాన్ని గౌరవిస్తూ, ఆచరిస్తూ వస్తున్నారు.

నూతన సంవత్సర ఆరంభం రోజున బ్రహ్మదేవున్ని ప్రార్ధిస్తే సకల శుభాలు కలుగుతాయి. బ్రహ్మదేవున్ని ప్రార్ధించే ఏకైక పండగ ఈ ఉగాదే. గౌరీ వ్రతము, సౌభాగ్య వ్రతాలు చేస్తారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోముకుడి బారి నుండి వేదాలను రక్షించి బ్రహ్మదేవునికిచ్చిన రోజు, సృష్టిని బ్రహ్మ ప్రారంభించిన రోజే ఉగాది.

ఈ పండగను ప్రజలందరు జరుపుకుంటారు. ప్రత్యేకించి విశ్వబ్రాహ్మణులు ఎంతో ఘనంగా నిర్వహించు కుంటారు. ఇల్లంతా శుభ్రపరచుకుని ఇంటికి, వ్యాపార సంస్థలకు సున్నాలు, రంగులు వేసుకుని చక్కగా రంగు రంగుల ముగ్గులతో అలంకరించుకుని ఉగాదికి ఒక రోజు ముందే అమవాస్య రోజునాడే పూజ ప్రారంభం చేస్తారు. పనిముట్లను శుభ్రపరచుకుని కులదైవాలైన విశ్వకర్మ భగవానుని, కాళికాదేవి అమ్మవారి,బ్రహ్మగారి పటాలకు నానావిధ పత్ర,పుష్పాలతో సుగంధ పుజా ద్రవ్యాలతో అలంకరించుకుని అఖండ దీపారాధన చేసి నిష్టతో పూజిస్తారు, దేవునికి ప్రత్యేకంగా “పడి” అనే మహానైవెద్యాన్ని మర్రి ఆకులతో విష్ణు చక్ర ఆకారంలో కుట్టి అందులో నివేదన చేస్తారు. వారు తినేందుకు పచ్చని మోదుగ ఆకులతో విస్తర్లు తయారు చేసుకుని ఏక భుక్త భోజనం చేస్తారు.

ఈ అఖండ దీపం కొండెక్కకుండా జాగ్రత్తలు తీసుకుని మరుసటి రోజైన ఉగాది నాటి పర్వదినాన ప్రత్యేక పూజలు చేసి పంచాంగ ఫలితాలను చూసుకుని ఆ రోజు కూడ నిష్టతో ఉంటారు. అఖండ దీపారాధన చేసిన మూడవ రోజు శుభముహూర్త శుభ ఘడియలలో కులదేవతలకు మహా నైవేద్య నివేదన చేసి మహాహారతినిచ్చి అఖండ దీపాన్ని, పూర్ణకలశాన్ని ,పనిముట్లను కదిపి (ఉద్వాసన చేసి) ఆ రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతపూజ చేసుకుని మూడు రోజుల పూజదీక్షనుండి విరమణ పొందుతారు. తిరిగి వారి వారి వ్యాపారంలో నిమగ్నమౌతారు.

ఈ విధంగా భారత దేశ హిందువులు ప్రకృతి అందించే కొత్తగా వచ్చే ఫల,దాన్య సంపందను తాను అనుభవిస్తున్నందుకు కృతజ్ఞతాభావం చేత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించి షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని తిని ఆ రోజే జ్యోతిష పండితులను కలిసి వారికి దక్షిణ తాంబూలాదులనిచ్చి పంచాంగ శ్రవణం చేస్తారు,ఈ పర్వదినం ప్రకృతి “సంపద” పండగా గుర్తించి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.