Download PDF
భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతమాచరించవలెను. ప్రతివారు ఉదయమునే లేచి, గృహమును ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి, మామిడి తోరణములు మున్నగువానితో అలంకరించవలెను. మండపమును పాలవల్లి మున్నగు వానితో బాగుగా అలంకరించి అందు వినాయక ప్రతిమనుంచవలెను.
మూడు చిన్న గిన్నెలను గాని గ్లాసులను గాని తీసుకొని మొదటిదానిలో పాద్యజలము, రెండవదానిలో ఆచమన జలము, మూడవదానిలో అర్ఘ్యజలమునుంచవలెను.
పంచమృతం - తేనె, నెయ్యి, పటికబెల్లము, పెరుగు, పాలు
పత్రములు
- సూచీ పత్రం – అనగా కుశమ్, కుశదర్భ, బర్హి, సూచ్యగ్ర మున్నగునవి
- బృహతీ పత్రం – నేలములక, పెద్దములక, వాకుడు మున్నగునవి
- బిల్వ పత్రం– మారేడు
- దూర్వా పత్రం – అనగా గరిక
- దుత్తూర పత్రం– ఉమ్మెత్త
- బదరీ పత్రం – రేగు
- అపామార్గ పత్రం – ఉత్తరేణి
- తులసి పత్రం –
- చూత పత్రం – మామిడి ఆకు
- కరవీర పత్రం– గన్నేరు
- విష్ణుక్రాంత పత్రం– నీలవర్ణపు చిన్న చిన్న పూలు పూయును
- దాడిమీ పత్రం – దానిమ్మ
- దేవదారు పత్రం – ఆకులు, చిన్నవిగా, గుండ్రంగా, సువాసన కలిగి ఉంటాయి
- మరువక పత్రం – మరువము
- సింధువార పత్రం – వావిలి
- జాజిపత్ర – జాజిపత్రి, జాపత్రి
- గండవీ పత్రం– తెల్లగరికె.
- శమీ పత్రం– జమ్మి
- అశ్వత్థ పత్రం – రావి
- అర్జున పత్రం– మద్ది
- ఆర్క పత్రం – జిల్లేడు
పూజ చేయు విధానం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ నర్వ విఘ్నోప శాంతయే ||
(పూజ పూర్వాంగము లో ఆచమనం, దీపారాధన, ప్రాణాయామము చేయవలెను. సంకల్పము చెప్పునపుడు ఎడమ అరచేతిని కుడి అరచేతితో పట్టుకుని ఈ క్రింది సంకల్పము చెప్పవలెను)
పూర్వాంగం చూ. ||
సంకల్పం –శ్రీ గోవింద గోవింద ||
మమ ఉపాత్త ………. సమేతస్య, మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం మధ్యే సంభావితానాం నర్వేషాం పాపానాం సద్యః అపనోదనార్ధం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య విజయాయురారోగ్యైశ్వర్యాభివృద్యర్థం సమస్త మంగళావాప్యర్థం సమస్త దురితోప శాంత్యర్థం సిద్ధివినాయక ప్రసాద సిద్ధ్యర్థం భాద్రపద శుక్ల చతుర్థీ పుణ్యకాలే సిద్ధివినాయక పూజాం కరిష్యే ||
తదంగ కలశ పూజాంచ కరిష్యే ||
కలశపూజ చే. ||
గణపతి పూజా ప్రారంభః ||
కరిష్యే గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం |
భక్తానామిష్టవరదం సర్వమంగళకారణం ||
ధ్యానం –
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాంకుశధరందేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం ||
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం ||
శ్రీ మహాగణపతిం ధ్యాయామి |
ఆవాహనం
అత్రాగచ్ఛ జగద్వంద్వ సురరాజార్చితేశ్వర |
అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణాసురపూజిత ||
శ్రీ మహాగణపతిం ఆవాహయామి |
ఆసనం
అనేక రత్నఖచితం ముక్తామణి విభూషితం |
రత్న సింహాసనం చారు గణేశ ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణపతిం ఆసనం సమర్పయామి |
పాద్యం
గౌరీపుత్ర నమస్తేఽస్తు దూర్వారపద్మాది సంయుతం |
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణద్విరదానన ||
శ్రీ మహాగణపతిం పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం
సిద్ధార్థ యవదూర్వాభిః గంధ పుష్పాక్షతైర్యుతం |
తిల పుష్ప సమాయుక్తం గృహణార్ఘ్యం గజాననా ||
శ్రీ మహాగణపతిం అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనం
కర్పూరాగరు పుష్పైశ్చ వాసితం విమలం జలం |
భక్త్యాదత్తం మయాదేవ కురుష్వాచమనం ప్రభో ||
శ్రీ మహాగణపతిం ఆచమనం సమర్పయామి |
మధుపర్క స్నానం
దధ్యాజ్య మధుసంయుక్తం మధుపర్కం మయాహృతం |
గృహాణ సర్వలోకేశ గజవక్త్ర నమోఽస్తు తే ||
శ్రీ మహాగణపతిం మధుపర్క స్నానం సమర్పయామి |
పంచామృత స్నానం
మధ్వాజ్య శర్కరాయుక్తం దధి క్షీర సమన్వితం |
పంచామృతం గృహాణేదం భక్తానామిష్టదాయకా ||
శ్రీ మహాగణపతిం పంచామృత స్నానం సమర్పయామి |
(యిచ్చట పాలు, పెరుగు, పండ్లరసము మున్నగు వానితో కూడ అభిషేకము శాస్త్రోక్త విధానముగా చేసికొనవచ్చును)
శుద్ధోదక స్నానం
గంగాది పుణ్యపానీయైః గంధ పుష్పాక్షతైర్యుతైః |
స్నానం కురుష్య భగవన్ ఉమాపుత్ర నమోఽస్తు తే ||
శ్రీ మహాగణపతిం శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి.
వస్త్రం
రక్తవస్త్రద్వయం దేవరాజరాజాది పూజిత |
భక్త్యాదత్తం గృహాణేదం భగవాన్ హరనందన ||
శ్రీ మహాగణపతిం వస్త్రయుగ్మం సమర్పయామి | (ఎర్రని వస్త్రములు)
యజ్ఞోపవీతం
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం |
గృహాణ చారు సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||
శ్రీ మహాగణపతిం యజ్ఞోపవీతం సమర్పయామి |
గంధము
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణపతిం శ్రీగంధం సమర్పయామి |
అక్షతాన్
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయా తండులాన్ శుభాన్ |
హరిద్రాచూర్ణసంయుక్తాన్ సంగృహాణ గణాధిప ||
శ్రీ మహాగణపతిం అక్షతాన్ సమర్పయామి |
పుష్పాణి
సుగంధీని చ పుష్పాణి జాజీకుంద ముఖానిచ |
ఏక వింశతి సంఖ్యాణి గృహాణ గణనాయక ||
శ్రీ మహాగణపతిం పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |
అథః అంగపూజా
- ఓం పార్వతీనందనాయ నమః | పాదౌ పూజయామి (పాదములను) |
- ఓం గణేశాయ నమః | గుల్ఫౌ పూజయామి (చీలమండను) |
- ఓం జగద్ధాత్రే నమః |జంఘే పూజయామి (మోకాలుక్రింద) |
- ఓం జగద్వల్లభాయ నమః | జానునీ పూజయామి (మోకాలు చిప్ప) |
- ఓం ఉమాపుత్రాయ నమః | ఊరూ పూజయామి (తొడలను) |
- ఓం వికటాయ నమః | కటిం పూజయామి (నడుమును పూజింపవలెను) |
- ఓం గుహాగ్రజాయ నమః | గుహ్యం పూజయామి (మర్మ స్థానములను) |
- ఓం మహత్తమాయ నమః | మేఢ్రం పూజయామి
- ఓం నాధాయ నమః | నాభిం పూజయామి (బొడ్డును) |
- ఓం ఉత్తమాయ నమః | ఉదరం పూజయామి (పొట్టను) |
- ఓం వినాయకాయనమః | వక్షఃస్థలం పూజయామి (ఛాతిని) |
- ఓం పాశచ్ఛిదేనమః |పార్శ్వే పూజయామి (పక్కలను) |
- ఓం హేరంబాయ నమః | హృదయం పూజయామి (హృదయము) |
- ఓం కపిలాయనమః | కంఠం పూజయామి (కంఠమును) |
- ఓం స్కంధాగ్రజాయ నమః | స్కంధే పూజయామి (భుజములను) |
- ఓం హరసుతాయ నమః | హస్తాన్ పూజయామి (చేతులను) |
- ఓం బ్రహ్మచారిణే నమః | బాహున్ పూజయామి (బాహువులను) |
- ఓం సుముఖాయ నమః | ముఖం పూజయామి (ముఖమును) |
- ఓం ఏకదంతాయ నమః | దంతౌ పూజయామి (దంతములను) |
- ఓం విఘ్ననేత్రే నమః | నేత్రే పూజయామి (కన్నులను) |
- ఓం శూర్పకర్ణాయనమః | కర్ణే పూజయామి (చెవులను) |
- ఓం ఫాలచంద్రాయనమః | ఫాలం పూజయామి (నుదురును) |
- ఓం నాగాభరణాయనమః | నాశికాం పూజయామి (ముక్కును) |
- ఓం చిరంతనాయ నమః |చుబుకం పూజయామి (గడ్డము క్రింది భాగమును) |
- ఓం స్థూలోష్ఠాయ నమః | ఓష్ఠా పూజయామి (పై పెదవిని) |
- ఓం గళన్మదాయ నమః | గండే పూజయామి (గండమును) |
- ఓం కపిలాయ నమః | కచాన్ పూజయామి (శిరస్సు పై రోమములున్న భాగమును) |
- ఓం శివప్రియాయై నమః | శిరః పూజయామి (శిరస్సును) |
- ఓం సర్వమంగళాసుతాయ నమః | సర్వాణ్యంగాని పూజయామి (సర్వ అవయవములను) |
ఏకవింశతి పత్ర పూజ(21 ఆకులు)
- ఓం ఉమాపుత్రాయనమః | మాచీపత్రం సమర్పయామి (దర్భ) |
- ఓం హేరంబాయనమః | బృహతీపత్రం సమర్పయామి (నేలములక) |
- ఓం లంబోదరాయనమః | బిల్వపత్రం సమర్పయామి (మారేడు) |
- ఓం ద్విరదాననాయ నమః | దూర్వాపత్రం సమర్పయామి (అనగా గరిక) |
- ఓం ధూమకేతవే నమః | దుర్ధూరపత్రం సమర్పయామి (ఉమ్మెత్త) |
- ఓం బృహతే నమః | బదరీపత్రం సమర్పయామి (రేగు) |
- ఓం అపవర్గదాయనమః | అపామార్గ పత్రం సమర్పయామి (ఉత్తరేణి) |
- ఓం ద్వైమాతురాయనమః | తులసీపత్రం సమర్పయామి (తులసి) |
- ఓం చిరంతనాయ నమః | చూతపత్రం సమర్పయామి (మామిడి ఆకు) |
- ఓం కపిలాయనమః | కరవీరపత్రం సమర్పయామి (గన్నేరు) |
- ఓం విష్ణుస్తుతాయ నమః | విష్ణుక్రాంత పత్రం సమర్పయామి (నీలంపువ్వుల చెట్టు ఆకు) |
- ఓం ఏకదంతాయ నమః | దాడిమీపత్రం సమర్పయామి (దానిమ్మ) |
- ఓం అమలాయనమః | ఆమలకీపత్రం సమర్పయామి (దేవదారు) |
- ఓం మహతే నమః | మరువక పత్రం సమర్పయామి (మరువము) |
- ఓం సింధురాయ నమః | సింధూర పత్రం సమర్పయామి (వావిలి) |
- ఓం గజాననాయనమః | జాతీ పత్రం సమర్పయామి (జాజిపత్రి) |
- ఓం గండగళన్మదాయ నమః | గండవీ పత్రం సమర్పయామి (తెల్లగరికె) |
- ఓం శంకరప్రియాయనమః | శమీ పత్రం సమర్పయామి (జమ్మి) |
- ఓం భృంగరాజ త్కటాయ నమః | అశ్వత్థ పత్రం సమర్పయామి (రావి) |
- ఓం అర్జునదంతాయ నమః | అర్జునపత్రం సమర్పయామి (మద్ది) |
- ఓం అర్కప్రభాయ నమః | అర్క పత్రం సమర్పయామి (జిల్లేడు) |
ఏకవింశతి పుష్ప పూజా – (21 పుష్పాలు)
- ఓం పంచాస్య గణపతయే నమః | పున్నాగ పుష్పం సమర్పయామి |
- ఓం మహా గణపతయే నమః | మందార పుష్పం సమర్పయామి |
- ఓం ధీర గణపతయే నమః | దాడిమీ పుష్పం సమర్పయామి |
- ఓం విష్వక్సేన గణపతయే నమః | వకుళ పుష్పం సమర్పయామి |
- ఓం ఆమోద గణపతయే నమః | అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి |
- ఓం ప్రమథ గణపతయే నమః | పాటలీ పుష్పం సమర్పయామి |
- ఓం రుద్ర గణపతయే నమః | ద్రోణ పుష్పం సమర్పయామి |
- ఓం విద్యా గణపతయే నమః | దుర్ధూర పుష్పం సమర్పయామి |
- ఓం విఘ్న గణపతయే నమః | చంపక పుష్పం సమర్పయామి |
- ఓం దురిత గణపతయే నమః | రసాల పుష్పం సమర్పయామి |
- ఓం కామితార్థప్రదగణపతయే నమః | కేతకీ పుష్పం సమర్పయామి |
- ఓం సమ్మోహ గణపతయే నమః | మాధవీ పుష్పం సమర్పయామి |
- ఓం విష్ణు గణపతయే నమః | శమ్యాక పుష్పం సమర్పయామి |
- ఓం ఈశ గణపతయే నమః | అర్క పుష్పం సమర్పయామి |
- ఓం గజాస్య గణపతయే నమః | కల్హార పుష్పం సమర్పయామి |
- ఓం సర్వసిద్ధి గణపతయే నమః | సేవంతికా పుష్పం సమర్పయామి |
- ఓం వీర గణపతయే నమః | బిల్వ పుష్పం సమర్పయామి |
- ఓం కందర్ప గణపతయే నమః | కరవీర పుష్పం సమర్పయామి |
- ఓం ఉచ్చిష్ఠ గణపతయే నమః | కుంద పుష్పం సమర్పయామి |
- ఓం బ్రహ్మ గణపతయే నమః | పారిజాత పుష్పం సమర్పయామి |
- ఓం జ్ఞాన గణపతయే నమః | జాతీ పుష్పం సమర్పయామి |
ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా – (రెండు దళములు కలిసిన గరిక)
- ఓం గణాధిపాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం పాశాంకుశధరాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం ఆఖువాహనాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం వినాయకాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం ఈశపుత్రాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం సర్వసిద్ధిప్రదాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం ఏకదంతాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం ఇభవక్త్రాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం మూషికవాహనాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం కుమారగురవే నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం కపిలవర్ణాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం బ్రహ్మచారిణే నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం మోదకహస్తాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం సురశ్రేష్ఠాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం గజనాసికాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం కపిత్థఫలప్రియాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం గజముఖాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం సుప్రసన్నాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం సురాగ్రజాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం ఉమాపుత్రాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
- ఓం స్కందప్రియాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
అష్టోత్తర శతనామ పూజ
- ఓం గజాననాయ నమః |
- ఓం గణాధ్యక్షాయ నమః |
- ఓం విఘ్నరాజాయ నమః |
- ఓం వినాయకాయ నమః |
- ఓం ద్వైమాతురాయ నమః |
- ఓం ద్విముఖాయ నమః |
- ఓం ప్రముఖాయ నమః |
- ఓం సుముఖాయ నమః |
- ఓం కృత్తినే నమః |
- ఓం సుప్రదీపాయ నమః |
- ఓం సుఖనిధయే నమః |
- ఓం సురాధ్యక్షాయ నమః |
- ఓం మంగళస్వరూపాయ నమః |
- ఓం ప్రమదాయ నమః |
- ఓం ప్రథమాయ నమః |
- ఓం ప్రాజ్ఞాయ నమః |
- ఓం విఘ్నకర్త్రే నమః |
- ఓం విఘ్నహంత్రే నమః |
- ఓం విశ్వనేత్రే నమః |
- ఓం విరాట్పతయే నమః |
- ఓం శ్రీపతయే నమః |
- ఓం వాక్పతయే నమః |
- ఓం పురాణపురుషాయ నమః |
- ఓం పూష్ణే నమః |
- ఓం పుష్కరోత్క్షిప్తహరణాయ నమః |
- ఓం అగ్రగణ్యాయ నమః |
- ఓం అగ్రపూజ్యాయ నమః |
- ఓం అగ్రగామినే నమః |
- ఓం భక్తనిధయే నమః |
- ఓం శృంగారిణే నమః |
- ఓం ఆశ్రితవత్సలాయ నమః |
- ఓం మంత్రకృతే నమః |
- ఓం చామీకరప్రభాయ నమః |
- ఓం సర్వాయ నమః |
- ఓం సర్వోపన్యాసాయ నమః |
- ఓం సర్వకర్త్రే నమః |
- ఓం సర్వనేత్రాయ నమః |
- ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |
- ఓం సర్వసిద్ధయే నమః |
- ఓం పంచహస్తాయ నమః |
- ఓం పార్వతీనందనాయ నమః |
- ఓం ప్రభవే నమః |
- ఓం కుమారగురవే నమః |
- ఓం సురారిఘ్నాయ నమః |
- ఓం మహాగణపతయే నమః |
- ఓం మాన్యాయ నమః |
- ఓం మహాకాలాయ నమః |
- ఓం మహాబలాయ నమః |
- ఓం హేరంబాయ నమః |
- ఓం లంబజఠరాయ నమః |
- ఓం హ్రస్వగ్రీవాయ నమః |
- ఓం మహేశాయ నమః |
- ఓం దివ్యాంగాయ నమః |
- ఓం మణికింకిణి మేఖలాయ నమః |
- ఓం సమస్తదేవతామూర్తయే నమః |
- ఓం అక్షోభ్యాయ నమః |
- ఓం కుంజరాసురభంజనాయ నమః |
- ఓం ప్రమోదాయ నమః |
- ఓం మహోదరాయ నమః |
- ఓం మదోత్కటాయ నమః |
- ఓం మహావీరాయ నమః |
- ఓం మంత్రిణే నమః |
- ఓం విష్ణుప్రియాయ నమః |
- ఓం భక్తజీవితాయ నమః |
- ఓం జితమన్మథాయ నమః |
- ఓం ఐశ్వర్యకారణాయ నమః |
- ఓం జయినే నమః |
- ఓం యక్షకిన్నరసేవితాయ నమః |
- ఓం గంగాసుతాయ నమః |
- ఓం గణాధీశాయ నమః |
- ఓం గంభీరనినదాయ నమః |
- ఓం వటవే నమః |
- ఓం అభీష్టవరదాయ నమః |
- ఓం జ్యోతిషే నమః |
- ఓం శివప్రియాయ నమః |
- ఓం శీఘ్రకారిణే నమః |
- ఓం శాశ్వతాయ నమః |
- ఓం భవాయ నమః |
- ఓం జలోత్థితాయ నమః |
- ఓం భవాత్మజాయ నమః |
- ఓం బ్రహ్మవిద్యాదిధారిణే నమః |
- ఓం జిష్ణవే నమః |
- ఓం సహిష్ణవే నమః |
- ఓం సతతోత్థితాయ నమః |
- ఓం విఘాతకారిణే నమః |
- ఓం విశ్వదృశే నమః |
- ఓం విశ్వరక్షాకృతే నమః |
- ఓం భావగమ్యాయ నమః |
- ఓం మంగళప్రదాయ నమః |
- ఓం అవ్యక్తాయ నమః |
- ఓం అప్రాకృతపరాక్రమాయ నమః |
- ఓం సత్యధర్మిణే నమః |
- ఓం సఖ్యై నమః |
- ఓం సరసాంబునిధయే నమః |
- ఓం మోదకప్రియాయ నమః |
- ఓం కాంతిమతే నమః |
- ఓం ధృతిమతే నమః |
- ఓం కామినే నమః |
- ఓం కపిత్థఫలప్రియాయ నమః |
- ఓం బ్రహ్మచారిణే నమః |
- ఓం బ్రహ్మరూపిణే నమః |
- ఓం కళ్యాణగురవే నమః |
- ఓం ఉన్మత్తవేషాయ నమః |
- ఓం వరజితే నమః |
- ఓం సమస్తజగదాధారాయ నమః |
- ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః |
- ఓం ఆక్రాంతపదచిత్ప్రభవే నమః |
- ఓం శ్రీవిఘ్నేశ్వరాయ నమః |
ష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి ||నానావిధపత్రపుష్పాణి సమర్పయామి ||
ధూపం
దశాంగం దేవదేవేశ సుగంధం చ మనోహరం |
ధూపం దాస్యామి వరద గృహాణ త్వం గజాననా ||
శ్రీ మహాగణపతిం ధూపమాఘ్రాపయామి |
దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా |
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ||
శ్రీ మహాగణపతిం దీపం దర్శయామి |
నైవేద్యం
శాల్యన్నం షడ్రసోపేతం ఫల లడ్డుక మోదకాన్ |
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం స్వీకురు శాంకరే ||
శ్రీ మహాగణపతిం నైవేద్యం సమర్పయామి |
పానీయం పావనం శ్రేష్ఠం గంగాది సలిలాహృతం |
హస్త ప్రక్షాళనార్థం త్వం గృహాణ గణనాయక ||
శ్రీ మహాగణపతిం హస్త ప్రక్షాళనం సమర్పయామి |
తాంబూలం
పూగీఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం |
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణపతిం తాంబూలం సమర్పయామి |
తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి |
నీరాజనం
నీరాజనం నీరజస్కన్ కర్పూరేణ కృతం మయా |
గృహాణ కరుణారాశే గజానన నమోఽస్తు తే||
శ్రీ మహాగణపతిం నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి |
మంత్రపుష్పం
జాజీచంపక పున్నాగ మల్లికా వకుళదిభిః |
పుష్పాంజలిం ప్రదాస్యామి గృహాణద్విరదాననా ||
శ్రీ మహాగణపతిం మంత్రపుష్పం సమర్పయామి |
(అవకాశమున్నవారు అనంతరము స్వర్ణపుష్పమును సమర్పించవలెను.)
ప్రదక్షిణం
యనికాని చ పాపాని జన్మాంతర కృతాని చ |
తాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే ||
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియా |
మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయకా ||
ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక |
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ ||
శ్రీ మహాగణపతిం ప్రదక్షిణం సమర్పయామి |
నమస్కారం
నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే |
నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజాననా ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
మమాభీష్ట ప్రదోభూయా వినాయక నమోఽస్తు తే ||
శ్రీ మహాగణపతిం సాష్టాంగ నమస్కారం సమర్పయామి |
ప్రార్థన
ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక |
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం ||
వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ |
అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా||
శ్రీ మహాగణపతిం ప్రార్థన నమస్కారం సమర్పయామి |
ఛత్రం
స్వర్ణదండసమాయుక్తం ముక్తాజాలకమండితం |
శ్వేత పట్టాత పత్రం చ గృహాణ గణనాయక ||
శ్రీ మహాగణపతిం ఛత్రం సమర్పయామి |
చామరం
హేమదండసమాయుక్తం గృహాణ గణనాయక |
చమరీవాలరజితం చామరం చామరార్చితా ||
ఉశీనిర్మితం దేవ వ్యజనం శ్వేదశాంతిదంహిమతోయ సమాసిక్తం గృహాణ గణనాయక||
శ్రీ మహాగణపతిం చామరం వీజయామి |
శ్రీ మహాగణపతిం ఆందోళికార్థం అక్షతాన్ సమర్పయామి |
శ్రీ మహాగణపతిం సమస్త రాజోపచారాన్, దేవోపచారాన్ సమర్పయామి |
పునరర్ఘ్యం
అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక |
గంధం పుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో ||
ఓం సిద్ధి వినాయకాయ నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం |
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయకపునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||ఓం సిద్ధి వినాయకనమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం |
నమస్తే భిన్నదంతాయ నమస్తే వరసూనవే |
యిదమర్ఘ్యం ప్రదాశ్యామి గృహాణ గణనాయక ||
ఓం సిద్ధి వినాయకాయ నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం |
గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ వినాయక |
గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన నమోఽస్తు తే ||
ఓం సిద్ధి వినాయకాయ నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం |
అనేన అర్ఘ్యప్రదానేన భగవాన్ సర్వాత్మకః సిద్ధివినాయకః ప్రియతాం |
అర్పణం
యస్యస్మృత్యా చ నామోక్త్యా తవః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం ||
అనయా షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధి వినాయకః స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |
విఘ్నేశ్వరుని దండకము
శ్రీ పార్వతీపుత్ర లోకత్రయస్తోత్ర సత్పుణ్యచారిత్ర భద్రేభవక్త్రా మహాకాయ కాత్యాయనీనాథసంజాత స్వామీ శివా సిద్ధి విఘ్నేశనీ పాద పద్మంబులన్ నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందుఖండంబు నీ నాల్గుహస్తంబులున్నీకరాళంబు నీ పెద్దవక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషకాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్నతొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ కుంకుమం బక్షతల్ జాజులన్ చంపకంబుల్ తగన్ మల్లెలున్ మొల్లలున్ మంచి చేమంతులన్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులున్మంచి దూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్మంచివౌ నిక్షుఖండంబులున్ రేగుపండ్లప్పడంబుల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ వడల్ పునుగులున్బూరెలున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయున్ జున్ను బాలాజ్యమున్నానుబియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగరు బళ్ళెమందుంచి నైవేద్యముం బంచ నీరాజనంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా నిన్ను పూజింపకే యన్యదైవంబులం బ్రార్థవల్సేయుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరుచందంబుగాదే మహాదేవ యో భక్తమందార యో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవచూడామణీ లోకరక్షామణీ బంధుచింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీ దాసదాసానుదాసుండ శ్రీ దొంతరాజాన్వయుండ రామాభిధానుండ నన్నిపుడు చేపట్టి సుశ్రేయునిన్ జేసి శ్రీమంతుగా జూచి హృత్పద్మ సింహాసనారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగుబంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్పాడియున్ పుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గగా చేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే నమస్తే నమః ||
మంగళహారతులు –
శంభుతనయునకు సిద్ధిగణనాథునకు- వాసిగల దేవతావంద్యునకును |
ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి – భూసురోత్తమ లోకపూజ్యునకును ||
జయ మంగళం నిత్య శుభ మంగళం ||
నేరేడు మారేడు నెలవంకమామిడి – దూర్వార చెంగల్వ ఉత్తరేణు |వేరువేరుగ దెచ్చి వేడ్కతో పూజింతు – పర్వమున దేవగణపతికి నెపుడు || జయ ||
సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు – పొసగ సజ్జనులచే పూజకొల్తు |శశిజూడరాకున్న జేకొంటి నొక వ్రతము – పర్వమున దేవగణపతికి నిపుడు || జయ ||
పానకము వడపప్పు పనస మామిడిపండ్లు – దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు |తేనెతో మాగిన తియ్య మామిడిపండ్లు – మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు || జయ ||
ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య – ఉండ్రాళ్ళమీదికి దండు పంపు |కమ్మని నెయ్యియు కడుముద్దపప్పును – బొజ్జవిరుగగ దినుచు పొరలుకొనుచు || జయ ||
వెండిపళ్ళెరములో వెయివేల ముత్యాలు – కొండలుగ నీలములు కలియబోసి |మెండుగను హారములు మెడనిండ వేసికొని – దండిగా నీకిత్తు ధవళారతి || జయ ||
పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు – గంధాల నినుగొల్తు కస్తూరినీ |ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తంబున – పర్వమున దేవగణపతికి నిపుడు || జయ ||
ఏకదంతంబును ఎల్లగజవదనంబు – బాగయినతొండంబు వలపు కడుపు |జోకయున మూషికము సొరిదినెక్కాడుచును – భవ్యుడగు దేవగణపతికి నిపుడు || జయ ||
మంగళము మంగళము మార్తాండతేజునకు – మంగళము సర్వజ్ఞ వందితునకు |మంగళము ముల్లోక మహితసంచారునకు – మంగళము దేవగణపతికి నిపుడు || జయ ||
సిద్ధివిఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు – ఒనరంగ నిరువదియొక్క పత్రి |దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత – యుమ్మెత్త దూర్వార యుత్తరేణి |కలువలు మారేడు గన్నేరు జిల్లేడు – దేవకాంచన రేగు దేవదారు |జాజి బలురక్కసి జమ్మిదాచెనపువ్వు – గరిక మాచిపత్రి మంచిమొలక || జయ ||
అగరు గంధాక్షతల్ ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును |భాద్రపద శుద్ధచవితిని పగటివేళ కుడుములును నానుబాలు ఉండ్రాళ్ళు పప్పుపాయసము జున్ను దేనెను పంక్తిమీర కోరిపూజింతు నిన్నెపుడు కోర్కెలలర || జయ ||
బంగారుచెంబుతో గంగోదకముదెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి |మల్లెపువ్వులు దెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణాలింగమునకు || జయ ||
పట్టుచీరలు మంచి పాడిపంటలుగల్గి గట్టిగా కనకములు కరులు హరులుఇష్టసంపదలిచ్చి యేలినస్వామికి పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు || జయ ||
ముక్కంటితనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చినిక్కముగ మనమును నీయందె నే నిల్పి ఎక్కుడగు పూజ లాలింపజేతు || జయ ||
మల్లెలా మొల్లలా మంచిసంపెంగలా చల్లనైనా గంధసారములనుఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నే జేతు కోరివిఘ్నేశ || జయ ||
దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకునుదేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికి నిపుడు || జయ ||
చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగానుపుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ||జయ ||
మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములునేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోను || జయ ||
ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలుమీ కరుణతోనుమాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందుము కోర్కెదీర || జయ ||
తెలుగురాష్ట్రముల లో ముదముతో బాలురు బుద్ధిసూక్ష్మతచేత పొగడుచుంద్రుబాలురను పండితుల బాలగోపాలుని గాచి రక్షించేటి గణపతికి నిపుడు || జయ ||
విఘ్నేశ్వరుని కథా ప్రారంభము |
మున్ను నైమిశారణ్యంబున సత్రయాగంబుచేయు శౌనకాదిమహర్షులకు సకలకథావిశారదుడగు సూతమహాముని యొకనాడు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, శాపమోక్షప్రకారంబును చెప్పదొడంగెను.
గజాసుర వృత్తాంతం –పూర్వము గజరూపముతో నున్న రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపంబొనర్ప, అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్ష్యమై వరంబు కోరుమన, గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి “స్వామీ! మీరు ఎల్లప్పుడూ నా యుదరమందే వసించి కాపాడుచుండు”డని కోరగా భక్తసులభుండగు నా మహేశ్వరుండాతని కోర్కెదీర్ప గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబుగ నుండె.
కైలాసమున పార్వతీదేవి భర్తజాడ దెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంతకాలంబునకు గజాసురగర్భస్థుడగుట తెలిసి రప్పించుకొనుమార్గంబు గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతివృత్తాంతమును దెలిపి, “యో మహానుభావ! పూర్వము భస్మాసురుని బారినుండి నా పతిని రక్షించి నాకొసంగితివి. ఇప్పుడుగూడ నుపాయాంతరముచే రక్షింపు” మని విలపింప హరి యాపార్వతీదేవి నూరడించి కైలాసంబున నుండుమని దెల్పి యంత నా హరియు బ్రహ్మాదిదేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి, పరమేశ్వర వాహనమగు నందిని గంగిరెద్దుగ నలంకరించి, బ్రహ్మాదిదేవతలందరిని విచిత్ర వాద్యముల ధరింపచేసి తానును చిరుగంటలు, సన్నాయిని తాల్చి గజాసురపురంబు జొచ్చి అందందు జగన్మోహనంబుగా నాడించుచుండ గజాసురుండు విని, వారలబిలిపించి తన భవనము నెదుట నాడించ నియమించగా బ్రహ్మాదిదేవతలు తమవాద్యవిశేషంబులు భోరుగొల్ప జగన్నాటక సూత్రధారియగు నాహరి చిత్రవిచిత్రగతుల గంగిరెద్దు నాడించగా గజాసురుండు పరమానందభరితుడై “మీకేమి కావలయునో కోరుడొసంగెద”నన, హరి సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకువచ్చె గాన శివునొసంగు” మని పల్కె. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుండగు శ్రీహరిగా నెరింగి ఇక తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని దలచి “నా శిరస్సు త్రిలోకపూజ్యముగ చేసి, నాచర్మమును నీవు ధరింపవే”యని ప్రార్థించి, విష్ణుమూర్తికి తన అంగీకారముదెలుప నాతండు నందిని ప్రేరేపించె. నందియు తన శృంగమ్ములచే గజాసురుని చీల్చి సంహరించె. అంత మహేశ్వరుండు గజాసుర గర్భమునుండి వెలువడివచ్చి విష్ణుమూర్తిని స్తుతించె. అంత నా హరియు “దుష్టాత్ములకిట్టి వరంబులీయరాదు. ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగు”నని యుపదేశించి ఈశ్వరుని, బ్రహ్మాది దేవతలను వీడ్కోలిపి, తాను వైకుంఠమ్మున కెరిగె. అంత శివుండును నందినెక్కి కైలాసంబున కతివేగంబుగ జనియె.
వినాయకోత్పత్తి –కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదులవలన విని ముదమంది, అభ్యంజనస్నానమాచరించుచు నలుగుబిండి నొక బాలునిగజేసి, ప్రాణంబొసంగి, వాకిలిద్వారమున కావలియుంచి, పార్వతి స్నానమాడి, సర్వాభరణములనలంకరించుకొనుచు పత్యాగమునమును నిరీక్షించుచుండె. అంత పరమేశ్వరుండు కైలాసమందిరమునకు వచ్చి, నందినవరోహించి లోనికిపోబోవ వాకిలిద్వారమందున్న బాలకుడడ్డగింప, కోపావేశుండై త్రిశూలంబుచే బాలకుని కంఠంబుదునిమి లోనికేగె.
అంత పార్వతీదేవి భర్తంగాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులపూజించె; నంత పరమానందమున వారిరువురు ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము రాగా, అంత నమ్మహేశ్వరుండు తానొనరించినపనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబు నాబాలుని కతికించి ప్రాణంబొసంగి ’గజానను’డను నామంబొసంగి యాతని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుండును తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండె. గజాననుండును సులభముగ నెక్కితిరుగుటకు అనింద్యుడను నొక ఎలుకను వాహనముగా చేసికొనియె.
కొంతకాలమునకు పార్వతీపరమేశ్వరులకు కుమారస్వామి జనియించె. అతడు మహాబలశాలి. అతని వాహనము నెమలి. అతడు దేవతల సేనానాయకుండై ప్రఖ్యాతి గాంచియుండెను.
విఘ్నేశాధిపత్యము –ఒకనాడు దేవతలు, మునులు, మానవులు కైలాసంబునకేగి పరమేశ్వరుని సేవించి, విఘ్నముల కొక్కని అధిపతిగా తమకొసంగుమని కోరగా గజాననుడు తాను జ్యేష్ఠుడనుగనుక ఆ యాధిపత్యము తన కొసంగమనియు; గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు గాన ఇయ్యాధిపత్యంబు తన కొసంగుమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. అంత నక్కుమారులజూచి “మీలో నెవరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నెవరు నా యొద్దకు వచ్చెదరో, వారికీ యాధిపత్యంబొసంగుదు”నని మహేశ్వరుండు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి నెమలివాహనమెక్కి వాయువేగంబుననేగె.
అంత గజాననుండు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి “అయ్యా! నా అసమర్ధత తామెరింగియు నిట్లాతీయదగునే? మీపాదసేవకుండను. నాయందు కటాక్షముంచి తగు నుపాయంబుదెల్పి రక్షింపవే” యని ప్రార్ధింప, మహేశ్వరుండు దయాళుడై “సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం! గంగాదిసరస్వతీర్ధేషు స్నాతో భవతి పుత్రక.” “కుమారా! ఒకసారి నారాయణమంత్రమును బఠించిన మాత్రమున మూడువందల కల్పంబులు పుణ్యనదులలో స్నానమొనర్చినవాడగును” అని సక్రమముగ నారాయణమంత్రంబుపదేశింప, గజాననుడు నత్యంత భక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసమ్మునుండె.అమ్మంత్రప్రభావంబున అంతకు పూర్వము గంగా నదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుండా నది లో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప, నతండును మూడుకోట్ల ఏబదిలక్షల నదులలోగూడ నటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబునకేగి యచటగూడ తండ్రిసమీపమందున్న గజాననుని గాంచి నమస్కరించి, తన బలమును నిందించుకొని, “తండ్రీ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుడు. తమ నిర్ణయంబు ననుసరించి యీ ఆధిపత్యము అన్నగారికే యొసగు” మని ప్రార్థించె.
అంత పరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థీనాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు, మొదలుగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహమునకొసంగియు, కొన్ని చేతధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబునకేగి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవ ఉదరము భూమికానిన చేతులు భూమికందవయ్యె. బలవంతముగ చేతులానింప చరణంబు లాకసంబుజూచె. ఇట్లు దండప్రణామంబు సేయ గడు శ్రమనొందుచుండ శివుని శిరంబున వెలయు చంద్రుడు చూచి వికటముగ నవ్వె. నంత ’రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గగు’ నను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములు తత్ప్రదేశం బెల్లెడల దొర్లె. నతండును మృతుండయ్యె.
అంత పార్వతి శోకించుచు చంద్రుని జూచి, “పాపాత్ముడా! నీదృష్టి తగిలి నా కుమారుడు మరణించెగాన, నిన్ను జూచినవారు పాపాత్ములై నిరాపనింద నొందుదురుగాక” యని శపించెను.
ఋషిపత్నులు నిరాపనింద కలుగుట –ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబుచేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను జూచి మోహించి శాపభయంబున అశక్తుడై క్షీణించుచుండ నయ్యది అగ్ని భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపముదక్క తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి పతికి ప్రియంబుసేయ, ఋషులద్దానిం గనుంగొని అగ్నిదేవునితో నున్నవారు తమభార్యలేయని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నిరాపనింద కలిగినది. దేవతలును, మునులును ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి దెల్ప నాతండు సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపంబుదాల్చి వచ్చుట దెల్పి సప్తమహర్షులను సమాధానపరచి వారితోగూడ బ్రహ్మ కైలాసంబునకేతెంచి ఉమామహేశ్వరుల సేవించి మృతుండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె. అంత దేవాదులు “ఓ దేవీ! పార్వతీ! నీవొసంగిన శాపంబున లోకంబులకెల్ల కీడువాటిల్లెగాన దాని నుపసంగరింపు”మని ప్రార్థింప పార్వతి సంతుష్టాంతరంగయె కుమారునిజేరదీసి, ముద్దాడి “ఏదినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వె నాదినంబున చంద్రుని జూడరాదు” అని శాపావకాశం బొసంగె. అంత బ్రహ్మాదిదేవతలు మున్నగువారు సంతసించుచు తమ నివాసంబులకేగి, భాద్రపద శుద్ధ చతుర్థీయందు మాత్రము చంద్రునింజూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇట్లు కొంతకాలంబు గడచె.
శమంతకోపాఖ్యానము –ద్వాపరయుగంబున ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియసంభాషణములు జరుపుచు “స్వామీ! సాయం సమయమయ్యె. ఈనాడు వినాయకచతుర్థిగాన పార్వతీశాపంబుచే చంద్రునిం జూడరాదుగనుక నిజగృహంబుకేగెద సెలవిండు” అని పూర్వవృత్తాంతంబంతయు శ్రీకృష్ణునికి దెల్పి నారదుడు స్వర్గలోకొబునకేగెను. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుననెవ్వరు చూడరాదని పట్టణమున చాటింపించెను. నాటిరాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడగుటచే తాను మింటివంక చూడక గోష్ఠమునకుబోయి పాలుపితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి “ఆహా! ఇక నాకెట్టి యపనింద రానున్నదో” యని సంశయమున నుండెను.
కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్య వరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్ధమై పోవ శ్రీకృష్ణుడు మర్యాద జేసి ఆ మణిని మన రాజుకిమ్మని యడిగిన, అతడు “ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసగునట్టిదీ మణి. ఎంతటి యాప్తునకే మందమతైననిచ్చునా” యని పలికిన పోనిమ్మని కృష్ణుడూరకుండెను. అంత నొకనాడా సత్రాజిత్తుతమ్ముడు ప్రసేనుండా శమంతకమును కంఠమున ధరించి వేటాడ నడవికిజన నొక సింహ మా మణిని మాంసఖండమని భ్రమించి వానిని జంపి యా మణిని గొనిపోవుచుండ, నొక భల్లూక మా సింహమును దునిమి యా మణింగొని తన కొండబిలమున తొట్టెలో బవళించియున్న తన కుమార్తెకు ఆటవస్తువుగ నొసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని “కృష్ణుండు మణి యివ్వలేదను కారణమున నా సోదరుని జంపి రత్న మపహరించె” నని పట్టణమున చాటె. అది కృష్ణుండు విని “ఆహా! నాడు క్షీరమున చంద్రబింబమును జూచిన దోషఫలం బిటుల కలిగిన” దని యెంచి దానిం బాపుకొన బంధుజన సేనాసమేతుండై యరణ్యమునకు బోయి వెదకగా నొక్కచో ప్రసేన మృతి కళేబరంబును, సింగపు కాలిజాడలను, పిదప భల్లూక చరణ విన్యాసంబును గాన్పించెను.
ఆ దారింబట్టి పోవుచుండ నొక పర్వతగుహలోని కీ చిహ్నములు గాన్పింప నంత గుహద్వారమువద్ద పర్వారమ్మునుంచి, కృష్ణుండు గుహలోపలకేగి అచట మిరుమిట్లుగొల్పుచు బాలిక ఊయెల పై కట్టబడియున్న మణింజూచి అచ్చటకు మెల్లనజని ఆ మణిని చేతపుచ్చుకుని వచ్చునంత ఊయలలోని బాలిక ఏడ్వదొడంగెను. అంత దాదియును వింతమానిషి వచ్చెననుచు కేకలు వేయ నది విని గుహలోనున్న జాంబవంతుడు రోషావేశుడై, చనుదెంచి శ్రీకృష్ణునిపైబడి అరచుచు, నఖంబుల గ్రుచ్చుచు, కోరలు గొరకుచు, ఘోరముగ యుద్ధముచేయ, కృష్ణుండును వానిం బడద్రోసి, వృక్షంబులచేతను, రాళ్ళచేతను, తుదకు ముష్టిఘాతములచేతను రాత్రింబవళ్ళు యెడతెగక యిరువదెనిమిది దినములు యుద్ధమొనర్ప, జాంబవంతుడు క్షీణబలుండై, దేహంబెల్ల నొచ్చి భీతిచెందుచు తన బలంబు హరింపజేసిన పురుషుండు రావణ సంహారియగు శ్రీరామచంద్రునిగా తలంచి, అంజలి ఘటించి “దేవాధిదేవా! ఆర్తజనపోషా! భక్తజనరక్షా! నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్టరాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులనుపాలించిన శ్రీరామచంద్రునిగా నెరింగితి; ఆ కాలమున నాయందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొరుమని ఆజ్ఞ యొసంగ నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధంబు జేయవలెనని కోరుకొంటిని. కాలాంతరమున నిది జరుగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణము చేయుచు అనేక యుగములు గడుపుచు నిటనుండ నిపుడు తము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరంబంతయు శిథిలమయ్యెను ప్రాణములుకడబెట్టె. జీవితేచ్ఛనశించె. నా అపరాధములు క్షమించి కాపాడుము నీకన్న వేరుదిక్కులేదు” అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్ధింప శ్రీకృష్ణుడు దయాళుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబున నిమిరి భయముంబాపి “భల్లుకేశ్వరా! శమంతకమణి నపహరించినట్లు నాపైనారోపించిన అపనింద బాపుకొనుటకిటువచ్చితి గాన మణినొసంగిన నేనేగెద” నని జాంబవంతునకు దెల్పనతడు శ్రీకృష్ణునకు మణిసహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగి రక్షింపవేడ నాతని కభయమొసంగి, కృష్ణుడు గుహవెల్వడి తన యాలస్యమునకు పరితపించు బంధు మిత్ర సైన్యంబుల కానందంబు కలిగించి కన్యారత్నముతోను, మణితోను శ్రీకృష్ణుడు పురంబుచేరే.
సభాస్థలికి పిన్న పెద్దలను జేర్చి సత్రాజిత్తును రావించి యావద్వృత్తాంతమును దెల్పి యాతనికి శమంతకమణి నొసంగిన నా సత్రాజిత్తు “అయ్యో! పరమాత్ముడగు శ్రీకృష్ణునిపై లేనిపోని నింద మోపి దోషంబునకు పాల్పడితి” నని చాల విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా శ్రీకృష్ణునకు సమర్పించి తప్పు క్షమించమని వేడుకొనెను. అంత శ్రీకృష్ణుండును, సత్యభామను గైకొని సంతోషించి “ఇతర మణులేల? మాకు భామామణి చాలును. సూర్యవరప్రసాదితమగు నీ శమంతకమణిని నీవే యుంచుకొనుము. మాకు వలదు” అనుచు మణిని సత్రాజిత్తునకొసంగి యాదరించెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి, సత్యభామలను పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి “మీరు సమర్థులు గనక నిరాపనింద బాపుకొంటిరి. మా కేమిగతి”యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై “భాద్రపదశుద్ధ చతుర్థిన ప్రమాదంబున చంద్రదర్శనమయ్యె నేని ఆనాడూ గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారు నిరాపనింద నొందకుండెదరు గాక” అని ఆనతీయ దేవాదులు “అనుగ్రహించబడితి” మని ఆనందించుచు తమ తమ నివాసములకేగి ప్రతి సంవత్సరమున భాద్రపదశుద్ధ చతుర్థీ యందు దేవతలు, మహర్షులు, మానవులు మున్నగువారందరు తమ తమ విభవములకొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి గాంచుచు సుఖముగ నుండిరని శాపమోక్ష ప్రకారము శౌనకాదిమునులకు సూతుండు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగె.
గమనిక –చంద్రదోష పరిహారార్థము ఈ శ్లోకము చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.
సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః |
సుకుమారకమారోదీః తపహ్యేష శమంతకః ||
సర్వేజనాస్సుఖినోభవంతు.