Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య

    September 22, 2026
    Facebook Instagram YouTube
    • అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత
    • 2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య
    • దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు
    • శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)
    • వినాయక చవితి వ్రత కథ
    • వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు

      September 21, 2026

      వినాయక చవితి వ్రత కథ

      September 9, 2026

      వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

      September 9, 2026

      శ్రీకృష్ణ జన్మాష్టమి – శుక్రవారం 4 సెప్టెంబర్, 2026

      August 30, 2026

      జంధ్యాల పౌర్ణమి – శుక్రవారం ఆగస్టు 28 2026

      August 26, 2026
    • భక్తి

      పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

      October 10, 2026

      అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

      October 6, 2026

      గణపతి తాళం – మూలం మరియు ప్రాముఖ్యత

      September 21, 2026

      సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026
    • విజ్ఞానం
    • డౌన్లోడ్స్

      యజ్ఞోపవీత ధారణ విధిః

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ రుద్ర నమకం/చమకం

      July 4, 2021
    • దేవాలయాలు
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    Home » నరసింహ శతకమ్/NARASIMHA SATAKAM
    భక్తి

    నరసింహ శతకమ్/NARASIMHA SATAKAM

    By JosyulaUpdated:August 22, 2026
    Share Facebook Twitter LinkedIn Email
    Follow Us
    Facebook Instagram YouTube WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Email

    రచన: సేషప్ప కవి

    001
    సీ. శ్రీమనోహర | సురా – ర్చిత సింధుగంభీర |
    భక్తవత్సల | కోటి – భానుతేజ |
    కంజనేత్ర | హిరణ్య – కశ్యపాంతక | శూర |
    సాధురక్షణ | శంఖ – చక్రహస్త |
    ప్రహ్లాద వరద | పా – పధ్వంస | సర్వేశ |
    క్షీరసాగరశాయి | – కృష్ణవర్ణ |
    పక్షివాహన | నీల – భ్రమరకుంతలజాల |
    పల్లవారుణపాద – పద్మయుగళ |

    తే. చారుశ్రీచందనాగరు – చర్చితాంగ |
    కుందకుట్మలదంత | వై – కుంఠధామ |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    002
    సీ. పద్మలోచన | సీస – పద్యముల్ నీ మీద
    జెప్పబూనితినయ్య | – చిత్తగింపు
    గణ యతి ప్రాస ల – క్షణము జూడగలేదు
    పంచకావ్య శ్లోక – పఠన లేదు
    అమరకాండత్రయం – బరసి చూడగలేదు
    శాస్త్రీయ గ్రంధముల్ – చదువలేదు
    నీ కటాక్షంబున – నే రచించెద గాని
    ప్రఙ్ఞ నాయది గాదు – ప్రస్తుతింప

    తే. దప్పుగలిగిన సద్భక్తి – తక్కువౌనె
    చెఱకునకు వంకపోయిన – చెడునె తీపు?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    003
    సీ. నరసింహ | నీ దివ్య – నామమంత్రముచేత
    దురితజాలము లన్ని – దోలవచ్చు
    నరసింహ | నీ దివ్య – నామమంత్రముచేత
    బలువైన రోగముల్ – పాపవచ్చు
    నరసింహ | నీ దివ్య – నామమంత్రముచేత
    రిపుసంఘముల సంహ – రింపవచ్చు
    నరసింహ | నీ దివ్య – నామమంత్రముచేత
    దండహస్తుని బంట్ల – దరమవచ్చు

    తే. భళిర | నే నీ మహామంత్ర – బలముచేత
    దివ్య వైకుంఠ పదవి సా – ధింపవచ్చు
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    004
    సీ. ఆదినారాయణా | – యనుచు నాలుకతోడ
    బలుక నేర్చినవారి – పాదములకు
    సాష్టాంగముగ నమ – స్కార మర్పణ జేసి
    ప్రస్తుతించెదనయ్య – బహువిధముల
    ధరణిలో నరులెంత – దండివారైనను
    నిన్ను గాననివారి – నే స్మరింప
    మేము శ్రేష్ఠుల మంచు – మిదుకుచుంచెడివారి
    చెంత జేరగనోను – శేషశయన

    తే. పరమ సాత్వికులైన నీ – భక్తవరుల
    దాసులకు దాసుడను జుమీ – ధాత్రిలోన
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    005
    సీ. ఐశ్వర్యములకు ని – న్ననుసరింపగలేదు
    ద్రవ్య మిమ్మని వెంట – దగులలేదు
    కనక మిమ్మని చాల – గష్టపెట్టగలేదు
    పల్ల కిమ్మని నోట – బలకలేదు
    సొమ్ము లిమ్మని నిన్ను – నమ్మి కొల్వగలేదు
    భూము లిమ్మని పేరు – పొగడలేదు
    బలము లిమ్మని నిన్ను – బ్రతిమాలగాలేదు
    పసుల నిమ్మని పట్టు – పట్టలేదు

    తే. నేను గోరిన దొక్కటే – నీలవర్ణ
    చయ్యనను మోక్షమిచ్చిన – జాలు నాకు
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    006
    సీ. మందుండనని నన్ను – నింద చేసిననేమి?
    నా దీనతను జూచి – నవ్వ నేమి?
    దూరభావములేక – తూలనాడిన నేమి?
    ప్రీతిసేయక వంక – బెట్ట నేమి?
    కక్కసంబులు పల్కి – వెక్కిరించిన నేమి?
    తీవ్రకోపముచేత – దిట్ట నేమి?
    హెచ్చుమాటలచేత – నెమ్మె లాడిన నేమి?
    చేరి దాపట గేలి – చేయనేమి?

    తే. కల్పవృక్షంబువలె నీవు – గల్గ నింక
    బ్రజల లక్ష్యంబు నాకేల? – పద్మనాభ |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    007
    సీ. చిత్తశుద్ధిగ నీకు – సేవజేసెదగాని
    పుడమిలో జనుల మె – ప్పులకు గాదు
    జన్మపావనతకై – స్మరణజేసెద గాని
    సరివారిలో బ్రతి – ష్థలకు గాదు
    ముక్తికోసము నేను – మ్రొక్కి వేడెదగాని
    దండిభాగ్యము నిమి – త్తంబు గాదు
    నిన్ను బొగడగ విద్య – నేర్చితినేకాని
    కుక్షినిండెడు కూటి – కొఱకు గాదు

    తే. పారమార్థికమునకు నే బాటుపడితి
    గీర్తికి నపేక్షపడలేదు – కృష్ణవర్ణ |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    008
    సీ. శ్రవణ రంధ్రముల నీ – సత్కథల్ పొగడంగ
    లేశ మానందంబు – లేనివాడు
    పుణ్యవంతులు నిన్ను – బూజసేయగ జూచి
    భావమందుత్సాహ – పడనివాడు
    భక్తవర్యులు నీ ప్ర – భావముల్ పొగడంగ
    దత్పరత్వములేక – తలగువాడు
    తనచిత్తమందు నీ – ధ్యాన మెన్నడు లేక
    కాలమంతయు వృధా – గడపువాడు

    తే. వసుధలోనెల్ల వ్యర్ధుండు – వాడె యగును
    మఱియు జెడుగాక యెప్పుడు – మమతనొంది.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    009
    సీ. గౌతమీస్నానాన – గడతేఱుద మటన్న
    మొనసి చన్నీళ్లలో – మునుగలేను
    తీర్థయాత్రలచే గృ – తార్థు డౌదమటన్న
    బడలి నేమంబు లే – నడపలేను
    దానధర్మముల స – ద్గతిని జెందుదమన్న
    ఘనముగా నాయొద్ద – ధనములేదు
    తపమాచరించి సా – ర్ధకము నొందుదమన్న
    నిమిషమైన మనస్సు – నిలుపలేను

    తే. కష్టములకోర్వ నాచేత – గాదు నిన్ను
    స్మరణచేసెద నా యధా – శక్తి కొలది.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    010
    సీ. అర్థివాండ్రకు నీక – హాని జేయుట కంటె
    దెంపుతో వసనాభి – దినుట మేలు
    ఆడుబిడ్డలసొమ్ము – లపహరించుట కంటె
    బండ గట్టుక నూత – బడుట మేలు
    పరులకాంతల బట్టి – బల్మి గూడుట కంటె
    బడబాగ్ని కీలల – బడుట మేలు
    బ్రతుకజాలక దొంగ – పనులు చేయుట కంటె
    గొంగుతో ముష్టెత్తు – కొనుట మేలు

    తే. జలజదళనేత్ర నీ భక్త – జనులతోడి
    జగడమాడెడు పనికంటె – జావు మేలు
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    011
    సీ. గార్దభంబున కేల – కస్తూరి తిలకంబు?
    మర్కటంబున కేల – మలయజంబు?
    శార్ధూలమునక కేల – శర్కరాపూపంబు?
    సూకరంబున కేల – చూతఫలము?
    మార్జాలమున కేల – మల్లెపువ్వులబంతి?
    గుడ్లగూబల కేల – కుండలములు?
    మహిషాని కేల ని – ర్మలమైన వస్త్రముల్?
    బకసంతతికి నేల – పంజరంబు?

    తే. ద్రోహచింతన జేసెడి – దుర్జనులకు
    మధురమైనట్టి నీనామ – మంత్రమేల?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    012
    సీ. పసరంబు వంజైన – బసులకాపరి తప్పు
    ప్రజలు దుర్జనులైన – ప్రభుని తప్పు
    భార్య గయ్యాళైన – బ్రాణనాధుని తప్పు
    తనయుడు దుష్టయిన – తండ్రి తప్పు
    సైన్యంబు చెదిరిన – సైన్యనాధుని తప్పు
    కూతురు చెడుగైన – మాత తప్పు
    అశ్వంబు చెడుగైన – నారోహకుని తప్పు
    దంతి దుష్టయిన మా – వంతు తప్పు

    తే. ఇట్టి తప్పులెఱుంగక – యిచ్చవచ్చి
    నటుల మెలగుదు రిప్పు డీ – యవని జనులు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    013
    సీ. కోతికి జలతారు – కుళ్లాయి యేటికి?
    విరజాజి పూదండ – విధవ కేల?
    ముక్కిడితొత్తుకు – ముత్తెంపు నత్తేల?
    నద్ద మేమిటికి జా – త్యంధునకును?
    మాచకమ్మకు నేల – మౌక్తికహారముల్?
    క్రూరచిత్తునకు స – ద్గోష్ఠు లేల?
    ఱంకుబోతుకు నేల – బింకంపు నిష్ఠలు?
    వావి యేటికి దుష్ట – వర్తనునకు?

    తే. మాట నిలుకడ కుంకరి – మోటు కేల?
    చెవిటివానికి సత్కథ – శ్రవణ మేల?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    014
    సీ. మాన్యంబులీయ స – మర్ధుడొక్కడు లేడు
    మాన్యముల్ చెఱుప స – మర్ధు లంత
    యెండిన యూళ్లగో – డెఱిగింప డెవ్వడు
    బండిన యూళ్లము – బ్రభువు లంత
    యితడు పేద యటంచు – నెఱిగింప డెవ్వండు
    కలవారి సిరు లెన్న – గలరు చాల
    దనయాలి చేష్టల – తప్పెన్న డెవ్వడు
    బెఱకాంత ఱంకెన్న – బెద్ద లంత

    తే. యిట్టి దుష్టుల కధికార – మిచ్చినట్టి
    ప్రభువు తప్పు లటంచును – బలుకవలెను.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    015
    సీ. తల్లిగర్భమునుండి – ధనము తే డెవ్వడు
    వెళ్లిపోయెడినాడు – వెంటరాదు
    లక్షాధికారైన – లవణ మన్నమె కాని
    మెఱుగు బంగారంబు – మ్రింగబోడు
    విత్త మార్జనజేసి – విఱ్ఱవీగుటె కాని
    కూడబెట్టిన సొమ్ము – తోడరాదు
    పొందుగా మఱుగైన – భూమిలోపల బెట్టి
    దానధర్మము లేక – దాచి దాచి

    తే. తుదకు దొంగల కిత్తురో – దొరల కవునొ
    తేనె జుంటీగ లియ్యవా – తెరువరులకు?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    016
    సీ. లోకమం దెవడైన – లోభిమానవు డున్న
    భిక్ష మర్థిమి జేత – బెట్టలేడు
    తాను బెట్టకయున్న – తగవు పుట్టదుగాని
    యొరులు పెట్టగ జూచి – యోర్వలేడు
    దాతదగ్గఱ జేరి – తన ముల్లె చెడినట్లు
    జిహ్వతో జాడీలు – చెప్పుచుండు
    ఫలము విఘ్నంబైన – బలు సంతసమునందు
    మేలు కల్గిన జాల – మిణుకుచుండు

    తే. శ్రీరమానాథ | యిటువంటి – క్రూరునకును
    భిక్షుకుల శత్రువని – పేరు పెట్టవచ్చు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    017
    సీ. తనువులో బ్రాణముల్ = తరళిపొయ్యెడివేళ
    నీ స్వరూపమును ధ్యా – నించునతడు
    నిమిషమాత్రములోన – నిన్ను జేరును గాని
    యముని చేతికి జిక్కి – శ్రమలబడడు
    పరమసంతోషాన – భజన జేసెడివారి
    పుణ్య మేమనవచ్చు – భోగిశయన
    మోక్షము నీ దాస – ముఖ్యుల కగు గాని
    నరక మెక్కడిదయ్య – నళిననేత్ర

    తే. కమలనాభ నీ మహిమలు – గానలేని
    తుచ్ఛులకు ముక్తిదొరకుట – దుర్లభంబు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    018
    సీ. నీలమేఘశ్యామ | – నీవె తండ్రివి మాకు
    కమలవాసిని మమ్ము – గన్నతల్లి
    నీ భక్తవరులంత – నిజమైన బాంధవుల్
    నీ కటాక్షము మా క – నేకధనము
    నీ కీర్తనలు మాకు – లోక ప్రపంచంబు
    నీ సహాయము మాకు – నిత్యసుఖము
    నీ మంత్రమే మాకు – నిష్కళంకపు విద్య
    నీ పద ధ్యానంబు – నిత్యజపము

    తే. తోయజాతాక్ష నీ పాద – తులసిదళము
    రోగముల కౌషధము బ్రహ్మ – రుద్రవినుత.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    019
    సీ. బ్రతికినన్నాళ్లు నీ – భజన తప్పను గాని
    మరణకాలమునందు – మఱతునేమొ
    యావేళ యమదూత – లాగ్రహంబున వచ్చి
    ప్రాణముల్ పెకలించి – పట్టునపుడు
    కఫ వాత పైత్యముల్ – గప్పగా భ్రమచేత
    గంప ముద్భవమంది – కష్టపడుచు
    నా జిహ్వతో నిన్ను – నారాయణా యంచు
    బిలుతునో శ్రమచేత – బిలువనొ

    తే. నాటి కిప్పుడె చేతు నీ – నామభజన
    తలచెదను, జెవి నిడవయ్య | – ధైర్యముగను.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    020
    సీ. పాంచభౌతికము దు – ర్బలమైన కాయం బి
    దెప్పుడో విడుచుట – యెఱుకలేదు
    శతవర్షములదాక – మితము జెప్పిరి గాని
    నమ్మరా దామాట – నెమ్మనమున
    బాల్యమందో మంచి – ప్రాయమందో లేక
    ముదిమియందో లేక – ముసలియందొ
    యూరనో యడవినో – యుదకమధ్యముననో
    యెప్పుడో విడుచుట – యేక్షణంబొ

    తే. మరణమే నిశ్చయము బుద్ధి – మంతుడైన
    దేహమున్నంతలో మిమ్ము – దెలియవలయు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    021
    సీ. తల్లిదండ్రులు భార్య – తనయు లాప్తులు బావ
    మఱదు లన్నలు మేన – మామగారు
    ఘనముగా బంధువుల్ – గల్గినప్పటికైన
    దాను దర్లగ వెంట – దగిలి రారు
    యముని దూతలు ప్రాణ – మపగరించుక పోగ
    మమతతో బోరాడి – మాన్పలేరు
    బలగ మందఱు దుఃఖ – పడుట మాత్రమె కాని
    యించుక యాయుష్య – మియ్యలేరు

    తే. చుట్టములమీది భ్రమదీసి – చూర జెక్కి
    సంతతము మిమ్ము నమ్ముట – సార్థకంబు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    022
    సీ. ఇభరాజవరద | ని – న్నెంత బిల్చినగాని
    మాఱు పల్క వదేమి – మౌనితనమొ?
    మునిజనార్చిత | నిన్ను – మ్రొక్కి వేడినగాని
    కనుల జూడ వదేమి – గడుసుదనమొ?
    చాల దైన్యమునొంది – చాటు చొచ్చినగాని
    భాగ్య మియ్య వదేమి – ప్రౌఢతనమొ?
    స్థిరముగా నీపాద – సేవ జేసెద నన్న
    దొరకజాల వదేమి – ధూర్తతనమొ?

    తే. మోక్షదాయక | యిటువంటి – మూర్ఖజనుని
    కష్టపెట్టిన నీకేమి – కడుపునిండు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    023
    సీ. నీమీద కీర్తనల్ – నిత్యగానము జేసి
    రమ్యమొందింప నా – రదుడగాను
    సావధానముగ నీ – చరణ పంకజ సేవ
    సలిపి మెప్పంపంగ – శబరిగాను
    బాల్యమప్పటినుండి – భక్తి నీయందున
    గలుగను బ్రహ్లాద – ఘనుడగాను
    ఘనముగా నీమీది – గ్రంథముల్ గల్పించి
    వినుతిసేయను వ్యాస – మునినిగాను

    తే. సాధుడను మూర్ఖమతి మను – ష్యాధముడను
    హీనుడను జుమ్మి నీవు – న న్నేలుకొనుము.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    024
    సీ. అతిశయంబుగ గల్ల – లాడనేర్చితిగాని
    పాటిగా సత్యముల్ – పలుకనేర
    సత్కార్య విఘ్నముల్ – సలుప నేర్చితిగాని
    యిష్ట మొందగ నిర్వ – హింపనేర
    నొకరి సొమ్ముకు దోసి – లొగ్గ నేర్చితిగాని
    చెలువుగా ధర్మంబు – సేయనేర
    ధనము లియ్యంగ వ – ద్దనగ నేర్చితిగాని
    శీఘ్ర మిచ్చెడునట్లు – చెప్పనేర

    తే. బంకజాతాక్ష | నే నతి – పాతకుడను
    దప్పులన్నియు క్షమియింప – దండ్రి వీవె |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    025
    సీ. ఉర్విలో నాయుష్య – మున్న పర్యంతంబు
    మాయ సంసారంబు – మరగి నరుడు
    సకల పాపములైన – సంగ్రహించును గాని
    నిన్ను జేరెడి యుక్తి – నేర్వలేడు
    తుదకు గాలునియొద్ది – దూత లిద్దఱు వచ్చి
    గుంజుక చని వారు – గ్రుద్దుచుండ
    హింస కోర్వగ లేక – యేడ్చి గంతులువేసి
    దిక్కు లేదని నాల్గు – దిశలు చూడ

    తే. దన్ను విడిపింప వచ్చెడి – ధన్యు డేడి
    ముందు నీదాసుడై యున్న – ముక్తి గలుగు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    026
    సీ. అధిక విద్యావంతు – లప్రయోజకులైరి
    పూర్ణశుంఠలు సభా – పూజ్యులైరి
    సత్యవంతులమాట – జన విరోధంబాయె
    వదరుబోతులమాట – వాసికెక్కె
    ధర్మవాదనపరుల్ – దారిద్ర్యమొందిరి
    పరమలోభులు ధన – ప్రాప్తులైరి
    పుణ్యవంతులు రోగ – భూత పీడితులైరి
    దుష్టమానవులు వ – ర్ధిష్ణులైరి

    తే. పక్షివాహన | మావంటి – భిక్షుకులకు
    శక్తిలేదాయె నిక నీవె – చాటు మాకు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    027
    సీ. భుజబలంబున బెద్ద – పులుల జంపగవచ్చు
    పాముకంఠము జేత – బట్టవచ్చు
    బ్రహ్మ రాక్షసకోట్ల – బాఱద్రోలగవచ్చు
    మనుజుల రోగముల్ – మాన్పవచ్చు
    జిహ్వ కిష్టముగాని – చేదు మ్రింగగవచ్చు
    బదను ఖడ్గము చేత – నదమవచ్చు
    గష్టమొందుచు ముండ్ల – కంపలో జొరవచ్చు
    దిట్టుబోతుల నోళ్లు – కట్టవచ్చు

    తే. బుడమిలో దుష్టులకు ఙ్ఞాన – బోధ తెలిపి
    సజ్జనుల జేయలే డెంత – చతురుదైన.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    028
    సీ. అవనిలోగల యాత్ర – లన్ని చేయగవచ్చు
    ముఖ్యుడై నదులందు – మునుగవచ్చు
    ముక్కుపట్టుక సంధ్య – మొనసి వార్వగవచ్చు
    దిన్నగా జపమాల – ద్రిప్పవచ్చు
    వేదాల కర్థంబు – విఱిచి చెప్పగవచ్చు
    శ్రేష్ఠ్ క్రతువు లెల్ల – జేయవచ్చు
    ధనము లక్షలు కోట్లు – దానమియ్యగవచ్చు
    నైష్ఠికాచారముల్ – నడుపవచ్చు

    తే. జిత్త మన్యస్థలంబున – జేరకుండ
    నీ పదాంభోజములయందు – నిలపరాదు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    029
    సీ. కర్ణయుగ్మమున నీ – కథలు సోకినజాలు
    పెద్ద పోగుల జోళ్లు – పెట్టినట్లు
    చేతు లెత్తుచు బూజ – సేయగల్గినజాలు
    తోరంపు కడియాలు – దొడిగినట్లు
    మొనసి మస్తకముతో – మ్రొక్క గల్గినజాలు
    చెలువమైన తురాయి – చెక్కినట్లు
    గళము నొవ్వగ నిన్ను – బలుక గల్గినజాలు
    వింతగా గంఠీలు – వేసినట్లు

    తే. పూని నిను గొల్చుటే సర్వ – భూషణంబు
    లితర భూషణముల నిచ్చ – గింపనేల.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    030
    సీ. భువనరక్షక | నిన్ను – బొగడనేరని నోరు
    వ్రజ కగోచరమైన – పాడుబొంద
    సురవరార్చిత | నిన్ను – జూడగోరని కనుల్
    జలములోపల నెల్లి – సరపుగుండ్లు
    శ్రీరమాధిమ | నీకు – సేవజేయని మేను
    కూలి కమ్ముడువోని – కొలిమితిత్తి
    వేడ్కతో నీకథల్ – వినని కర్ణములైన
    గఠినశిలాదుల – గలుగు తొలలు

    తే. పద్మలోచన నీమీద – భక్తిలేని
    మానవుడు రెండుపాదాల – మహిషమయ్య.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    031
    సీ. అతివిద్యనేర్చుట – అన్నవస్త్రములకే
    పసుల నార్జించుట – పాలకొఱకె
    సతిని బెండ్లాడుట – సంసార సుఖముకే
    సుతుల బోషించుట – గతులకొఱకె
    సైన్యముల్ గూర్చుట – శత్రుజయమునకే
    సాము నేర్చుటలెల్ల – చావుకొఱకె
    దానమిచ్చుటయు ముం – దటి సంచితమునకే
    ఘనముగా జదువుట – కడుపు కొఱకె

    తే. యితర కామంబు గోరక – సతతముగను
    భక్తి నీయందు నిలుపుట – ముక్తి కొఱకె
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    032
    సీ. ధరణిలో వేయేండ్లు – తనువు నిల్వగబోదు
    ధన మెప్పటికి శాశ్వ – తంబు గాదు
    దారసుతాదులు – తనవెంట రాలేరు
    భ్రుత్యులు మృతిని ద – ప్పింపలేరు
    బంధుజాలము తన్ను – బ్రతికించుకోలేరు
    బలపరాక్రమ మేమి – పనికి రాదు
    ఘనమైన సకల భా – గ్యం బెంత గల్గిన
    గోచిమాత్రంబైన – గొనుచుబోడు

    తే. వెఱ్ఱి కుక్కల భ్రమలన్ని – విడిచి నిన్ను
    భజన జేసెడివారికి – బరమసుఖము.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    033
    సీ. నరసింహ | నాకు దు – ర్ణయములే మెండాయె
    సుగుణ మొక్కటిలేదు – చూడ జనిన
    నన్యకాంతల మీద – నాశ మానగలేను
    నొరుల క్షేమము చూచి – యోర్వలేను
    ఇటువంటి దుర్బుద్ధు – లిన్ని నా కున్నవి
    నేను జేసెడివన్ని – నీచకృతులు
    నావంటి పాపిష్ఠి – నరుని భూలోకాన
    బుట్టజేసితి వేల – భోగిశయన |

    తే. అబ్జదళనేత్ర | నాతండ్రి – వైన ఫలము
    నేరములు గాచి రక్షింపు – నీవె దిక్కు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    034
    సీ. ధీరత బరుల నిం – దింప నేర్చితి గాని
    తిన్నగా నిను బ్రస్తు – తింపనైతి
    బొరుగు కామినులందు – బుద్ధి నిల్పితి గాని
    నిన్ను సంతతము ధ్యా – నింపనైతి
    బెరికిముచ్చట లైన – మురిసి వింటినిగాని
    యెంచి నీకథ లాల – కించనైతి
    గౌతుకంబున బాత – కము గడించితిగాని
    హెచ్చు పుణ్యము సంగ్ర – హింపనైతి

    తే. నవనిలో నేను జన్మించి – నందు కేమి
    సార్థకము గానరాదాయె – స్వల్పమైన.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    035
    సీ. అంత్యకాలమునందు – నాయాసమున నిన్ను
    దలతునో తలపనో – తలతు నిపుడె
    నరసింహ | నరసింహ | – నరసింహ | లక్ష్మీశ |
    దానవాంతక | కోటి – భానుతేజ |
    గోవింద | గోవింద | – గోవింద | సర్వేశ |
    పన్నగాధిపశాయి | – పద్మనాభ |
    మధువైరి | మధువైరి | – మధువైరి | లోకేశ |
    నీలమేఘశరీర | నిగమవినుత |

    తే. ఈ విధంబున నీనామ – మిష్టముగను
    భజనసేయుచు నుందు నా – భావమందు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    036
    సీ. ఆయురారోగ్య పు – త్రార్థ సంపదలన్ని
    కలుగజేసెడి భార – కర్త వీవె
    చదువు లెస్సగ నేర్పి – సభలో గరిష్ఠాధి
    కార మొందించెడి – ఘనుడ వీవె
    నడక మంచిది పెట్టి – నరులు మెచ్చేడునట్టి
    పేరు రప్పించెడి – పెద్ద వీవె
    బలువైన వైరాగ్య – భక్తిఙ్ఞానములిచ్చి
    ముక్తి బొందించెడు – మూర్తి వీవె

    తే. అవనిలో మానవుల కన్ని – యాసలిచ్చి
    వ్యర్థులను జేసి తెలిపెడి – వాడ వీవె.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    037
    సీ. కాయ మెంత భయాన – గాపాడిననుగాని
    ధాత్రిలో నది చూడ – దక్క బోదు
    ఏవేళ నేరోగ – మేమరించునొ? సత్త్వ
    మొందంగ జేయు నే – చందమునను
    ఔషధంబులు మంచి – వనుభవించిన గాని
    కర్మ క్షీణంబైన గాని – విడదు;
    కోటివైద్యులు గుంపు – గూడివచ్చిన గాని
    మరణ మయ్యెడు వ్యాధి – మాన్పలేరు

    తే. జీవుని ప్రయాణకాలంబు – సిద్ధమైన
    నిలుచునా దేహ మిందొక్క – నిమిషమైన?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    038
    సీ. జందె మింపుగ వేసి – సంధ్య వార్చిన నేమి
    బ్రహ్మ మందక కాడు – బ్రాహ్మణుండు
    తిరుమణి శ్రీచూర్ణ – గురురేఖ లిడినను
    విష్ణు నొందక కాడు – వైష్ణవుండు
    బూదిని నుదుటను – బూసికొనిన నేమి
    శంభు నొందక కాడు – శైవజనుడు
    కాషాయ వస్త్రాలు – గట్టి కప్పిన నేమి
    యాశ పోవక కాడు – యతివరుండు

    తే. ఎన్ని లౌకికవేషాలు – గట్టుకొనిన
    గురుని జెందక సన్ముక్తి – దొరకబోదు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    039
    సీ. నరసింహ | నే నిన్ను – నమ్మినందుకు జాల
    నెనరు నాయందుంచు – నెమ్మనమున
    నన్ని వస్తువులు ని – న్నడిగి వేసటపుట్టె
    నింకనైన గటాక్ష – మియ్యవయ్య
    సంతసంబున నన్ను – స్వర్గమందే యుంచు
    భూమియందే యుంచు – భోగశయన |
    నయముగా వైకుంఠ – నగరమందే యుంచు
    నరకమందే యుంచు – నళిననాభ |

    తే. ఎచట నన్నుంచిననుగాని – యెపుడు నిన్ను
    మఱచి పోకుండ నీనామ – స్మరణనొసగు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    040
    సీ. దేహ మున్నవఱకు – మోహసాగరమందు
    మునుగుచుందురు శుద్ధ – మూఢజనులు
    సలలితైశ్వర్యముల్ – శాశ్వతం బనుకొని
    షడ్భ్రమలను మాన – జాల రెవరు
    సర్వకాలము మాయ – సంసార బద్ధులై
    గురుని కారుణ్యంబు గోరుకొనరు
    ఙ్ఞాన భక్తి విరక్తు – లైన పెద్దల జూచి
    నింద జేయక – తాము నిలువలేరు

    తే. మత్తులైనట్టి దుర్జాతి – మనుజులెల్ల
    నిన్ను గనలేరు మొదటికే – నీరజాక్ష.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    041
    సీ. ఇలలోన నే జన్మ – మెత్తినప్పటినుండి
    బహు గడించితినయ్య – పాతకములు
    తెలిసి చేసితి గొన్ని – తెలియజాలక చేసి
    బాధ నొందితి నయ్య – పద్మనాభ
    అనుభవించెడు నప్పు – దతి ప్రయాసంబంచు
    బ్రజలు చెప్పగ జాల – భయము గలిగె
    నెగిరి పోవుటకునై – యే యుపాయంబైన
    జేసి చూతమటన్న – జేతగాదు

    తే. సూర్యశశినేత్ర | నీచాటు – జొచ్చి నాను
    కలుషములు ద్రుంచి నన్నేలు – కష్టమనక.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    042
    సీ. తాపసార్చిత | నేను – పాపకర్ముడనంచు
    నాకు వంకలబెట్ట – బోకుచుమ్మి
    నాటికి శిక్షలు – నన్ను చేయుటకంటె
    నేడు సేయుము నీవు – నేస్తమనక
    అతిభయంకరులైన – యమదూతలకు నన్ను
    నొప్పగింపకు మయ్య – యురగశయన |
    నీ దాసులను బట్టి – నీవు దండింపంగ
    వద్దు వద్దన రెంత – పెద్దలైన

    తే. దండ్రివై నీవు పరపీడ – దగులజేయ
    వాసిగల పేరు కపకీర్తి – వచ్చునయ్య.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    043
    సీ. ధరణిలోపల నేను – తల్లిగర్భమునందు
    బుట్టినప్పటినుండి – పుణ్యమెఱుగ
    నేకాదశీవ్రతం – బెన్న డుండుగ లేదు
    తీర్థయాత్రలకైన – దిరుగలేదు
    పారమార్థికమైన – పనులు చేయగలేదు
    భిక్ష మొక్కనికైన – బెట్టలేదు
    ఙ్ఞానవంతులకైన – బూని మ్రొక్కగలేదు
    ఇతర దానములైన – నియ్యలేదు

    తే. నళినదళనేత్ర | నిన్ను నే – నమ్మినాను
    జేరి రక్షింపవే నన్ను – శీఘ్రముగను.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    044
    సీ. అడవిపక్షుల కెవ్వ – డాహార మిచ్చెను
    మృగజాతి కెవ్వడు – మేతబెట్టె
    వనచరాదులకు భో – జన మెవ్వ డిప్పించె
    జెట్ల కెవ్వడు నీళ్ళు – చేదిపోసె
    స్త్రీలగర్భంబున – శిశువు నెవ్వడు పెంచె
    ఫణుల కెవ్వడు పోసె – బరగ బాలు
    మధుపాళి కెవ్వడు – మకరంద మొనరించె
    బసుల మెవ్వ డొసంగె – బచ్చిపూరి

    తే. జీవకోట్లను బోషింప – నీవెకాని
    వేఱె యొక దాత లేడయ్య – వెదకిచూడ.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    045
    సీ. దనుజారి | నావంటి – దాసజాలము నీకు
    కోటి సంఖ్య గలారు – కొదువ లేదు
    బంట్లసందడివల్ల – బహుపరాకై నన్ను
    మఱచి పోకుము భాగ్య – మహిమచేత
    దండిగా భ్రుత్యులు – దగిలి నీకుండంగ
    బక్కబం టేపాటి – పనికి నగును?
    నీవు మెచ్చెడి పనుల్ – నేను జేయగలేక
    యింత వృథాజన్మ – మెత్తినాను

    తే. భూజనులలోన నే నప్ర – యోజకుడను
    గనుక నీ సత్కటాక్షంబు – గలుగజేయు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    046
    సీ. కమలలోచన | నన్ను – గన్నతండ్రివిగాన
    నిన్ను నేమఱకుంటి – నేను విడక
    యుదరపోషణకునై – యొకరి నే నాశింప
    నేర నా కన్నంబు – నీవు నడపు
    పెట్టలే నంటివా – పిన్న పెద్దలలోన
    దగవు కిప్పుడు దీయ – దలచినాను
    ధనము భారంబైన – దలకిరీటము నమ్ము
    కుండలంబులు పైడి – గొలుసు లమ్ము

    తే. కొసకు నీ శంఖ చక్రముల్ – కుదువబెట్టి
    గ్రాసము నొసంగి పోషించు – కపటముడిగి.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    047
    సీ. కువలయశ్యామ | నీ – కొలువు చేసిన నాకు
    జీత మెందుకు ముట్ట – జెప్పవైతి
    మంచిమాటలచేత – గొంచెమియ్యగలేవు
    కలహమౌ నిక జుమ్మి – ఖండితముగ
    నీవు సాధువు గాన – నింత పర్యంతంబు
    చనవుచే నిన్నాళ్లు – జరుపవలసె
    నిక నే సహింప నీ – విపుడు నన్నేమైన
    శిక్ష చేసిన జేయు – సిద్ధమయితి

    తే. నేడు కరుణింపకుంటివా – నిశ్చయముగ
    దెగబడితి చూడు నీతోడ – జగడమునకు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    048
    సీ. హరి | నీకు బర్యంక – మైన శేషుడు చాల
    బవనము భక్షించి – బ్రతుకుచుండు
    ననువుగా నీకు వా – హనమైన ఖగరాజు
    గొప్పపామును నోట – గొఱుకుచుండు
    అదిగాక నీ భార్య – యైన లక్ష్మీదేవి
    దినము పేరంటంబు – దిరుగుచుండు
    నిన్ను భక్తులు పిల్చి – నిత్యపూజలు చేసి
    ప్రేమ బక్వాన్నముల్ – పెట్టుచుండ్రు

    తే. స్వస్థముగ నీకు గ్రాసము – జరుగుచుండు
    గాసు నీ చేతి దొకటైన – గాదు వ్యయము.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    049
    సీ. పుండరీకాక్ష | నా – రెండు కన్నుల నిండ
    నిన్ను జూచెడి భాగ్య – మెన్నడయ్య
    వాసిగా నా మనో – వాంఛ దీరెడునట్లు
    సొగసుగా నీరూపు – చూపవయ్య
    పాపకర్ముని కంట – బడకపోవుదమంచు
    బరుషమైన ప్రతిఙ్ఞ – బట్టినావె?
    వసుధలో బతిత పా – వనుడ వీ వంచు నే
    బుణ్యవంతులనోట – బొగడ వింటి

    తే. నేమిటికి విస్తరించె నీ – కింత కీర్తి
    ద్రోహినైనను నా కీవు – దొరకరాదె?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    050
    సీ. పచ్చి చర్మపు దిత్తి – పసలేదు దేహంబు
    లోపల నంతట – రోయ రోత
    నరములు శల్యముల్ – నవరంధ్రములు రక్త
    మాంసంబు కండలు – మైల తిత్తి
    బలువైన యెండ వా – నల కోర్వ దింతైన
    దాళలే దాకలి – దాహములకు
    సకల రోగములకు – సంస్థానమె యుండు
    నిలువ దస్థిరమైన – నీటిబుగ్గ

    తే. బొందిలో నుండు ప్రాణముల్ – పోయినంత
    గాటికే గాని కొఱగాదు – గవ్వకైన.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    051
    సీ. పలురోగములకు నీ – పాదతీరమె కాని
    వలపు మందులు నాకు – వలదు వలదు
    చెలిమి సేయుచు నీకు – సేవ జేసెద గాన
    నీ దాసకోటిలో – నిలుపవయ్య
    గ్రహభయంబునకు జ – క్రము దలచెదగాని
    ఘోరరక్షలు గట్ట – గోరనయ్య
    పాముకాటుకు నిన్ను – భజన జేసెదగాని
    దాని మంత్రము నేను – తలపనయ్య

    తే. దొరికితివి నాకు దండి వై – ద్యుడవు నీవు
    వేయికష్టాలు వచ్చినన్ – వెఱవనయ్య.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    052
    సీ. కూటికోసరము నే – గొఱగాని జనులచే
    బలుగద్దరింపులు – పడగవలసె?
    దార సుత భ్రమ – దగిలియుండగగదా
    దేశదేశములెల్ల – దిరుగవలసె?
    బెను దరిద్రత పైని – బెనగియుండగగదా
    చేరి నీచులసేవ – చేయవలసె?
    నభిమానములు మది – నంటియుండగగదా
    పరుల జూచిన భీతి – పడగవలసె?

    తే. నిటుల సంసారవారిధి – నీదలేక
    వేయివిధముల నిన్ను నే – వేడుకొంటి.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    053
    సీ. సాధు సజ్జనులతో – జగడమాడిన గీడు
    కవులతో వైరంబు – గాంచ గీడు
    పరమ దీనుల జిక్క – బట్టి కొట్టిన గీడు
    భిక్షగాండ్రను దుఃఖ – పెట్ట గీడు
    నిరుపేదలను జూచి – నిందజేసిన గీడు
    పుణ్యవంతుల దిట్ట – బొసగు గీడు
    సద్భక్తులను దిర – స్కారమాడిన గీడు
    గురుని ద్రవ్యము దోచు – కొనిన గీడు

    తే. దుష్టకార్యము లొనరించు – దుర్జనులకు
    ఘనతరంబైన నరకంబు – గట్టిముల్లె.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    054
    సీ. పరులద్రవ్యముమీద – భ్రాంతి నొందినవాడు
    పరకాంతల నపేక్ష – పడెడువాడు
    అర్థుల విత్తంబు – లపహరించెడువాడు
    దానమియ్యంగ వ – ద్దనెడివాడు
    సభలలోపల నిల్చి – చాడిచెప్పెడివాడు
    పక్షపు సాక్ష్యంబు – పలుకువాడు
    విష్ణుదాసుల జూచి – వెక్కిరించెడివాడు
    ధర్మసాధుల దిట్ట – దలచువాడు

    తే. ప్రజల జంతుల హింసించు – పాతకుండు
    కాలకింకర గదలచే – గష్టమొందు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    055
    సీ. నరసింహ | నా తండ్రి – నన్నేలు నన్నేలు
    కామితార్థము లిచ్చి – కావు కావు
    దైత్యసంహార | చాల – దయయుంచు దయయుంచు
    దీనపోషక | నీవె – దిక్కు దిక్కు
    రత్నభూషితవక్ష | – రక్షించు రక్షించు
    భువనరక్షక | నన్ను – బ్రోవు బ్రోవు
    మారకోటిసురూప | – మన్నించు మన్నించు
    పద్మలోచన | చేయి – పట్టు పట్టు

    తే. సురవినుత | నేను నీచాటు – జొచ్చినాను
    నా మొఱాలించి కడతేర్చు – నాగశయన |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    056
    సీ. నీ భక్తులను గనుల్ – నిండ జూచియు రెండు
    చేతుల జోహారు – సేయువాడు
    నేర్పుతో నెవరైన – నీ కథల్ చెప్పంగ
    వినయమందుచు జాల – వినెడువాడు
    తన గృహంబునకు నీ – దాసులు రా జూచి
    పీటపై గూర్చుండ – బెట్టువాడు
    నీసేవకుల జాతి – నీతు లెన్నక చాల
    దాసోహ మని చేర – దలచువాడు

    తే. పరమభక్తుండు ధన్యుండు – భానుతేజ |
    వాని గనుగొన్న బుణ్యంబు – వసుధలోన.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    057
    సీ. పక్షివాహన | నేను – బ్రతికినన్నిదినాలు
    కొండెగాండ్రను గూడి – కుమతినైతి
    నన్నవస్త్రము లిచ్చి – యాదరింపుము నన్ను
    గన్నతండ్రివి నీవె – కమలనాభ |
    మరణ మయ్యెడినాడు – మమతతో నీయొద్ది
    బంట్ల దోలుము ముందు – బ్రహ్మజనక |
    ఇనజభటావళి – యీడిచికొనిపోక
    కరుణతో నాయొద్ద – గావ లుంచు

    తే. కొసకు నీ సన్నిధికి బిల్చు – కొనియు నీకు
    సేవకుని జేసికొనవయ్య – శేషశయన |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    058
    సీ. నిగమాదిశాస్త్రముల్ – నేర్చిన ద్విజుడైన
    యఙ్ఞకర్తగు సోమ – యాజియైన
    ధరణిలోపల బ్రభా – త స్నానపరుడైన
    నిత్యసత్కర్మాది – నిరతుడైన
    నుపవాస నియమంబు – లొందు సజ్జనుడైన
    గావివస్త్రముగట్టు – ఘనుడునైన
    దండిషోడశమహా – దానపరుండైన
    సకల యాత్రలు సల్పు – సరసుడైన

    తే. గర్వమున గష్టపడి నిన్ను – గానకున్న
    మోక్షసామ్రాజ్య మొందడు – మోహనాంగ |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    059
    సీ. పంజరంబున గాకి – బట్టి యుంచిన లెస్స
    పలుకునే వింతైన – చిలుకవలెను?
    గార్దభంబును దెచ్చి – కళ్లెమింపుగవేయ
    దిరుగునే గుఱ్ఱంబు – తీరుగాను?
    ఎనుపపోతును మావ – టీ డు శిక్షించిన
    నడచునే మదవార – ణంబువలెను?
    పెద్దపిట్టను మేత – బెట్టి పెంచిన గ్రొవ్వి
    సాగునే వేటాడు – డేగవలెను?

    తే. కుజనులను దెచ్చి నీ సేవ – కొఱకు బెట్ట
    వాంఛతో జేతురే భక్త – వరులవలెను?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    060
    సీ. నీకు దాసుడ నంటి – నిన్ను నమ్ముకయుంటి
    గాన నాపై నేడు – కరుణజూడు
    దోసిలొగ్గితి నీకు – ద్రోహ మెన్నగబోకు
    పద్మలోచన | నేను – పరుడగాను
    భక్తి నీపై నుంచి – భజన జేసెద గాని
    పరుల వేడను జుమ్మి – వరము లిమ్ము
    దండిదాతవు నీవు – తడవుసేయక కావు
    ఘోరపాతకరాశి – గొట్టివైచి

    తే. శీఘ్రముగ గోర్కు లీడేర్చు – చింత దీర్చు
    నిరతముగ నన్ను బోషించు – నెనరు నుంచు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    061
    సీ. విద్య నేర్చితి నంచు – విఱ్ఱవీగగలేదు
    భాగ్యవంతుడ నంచు – బలుకలేదు
    ద్రవ్యవంతుడ నంచు – దఱచు నిక్కగలేదు
    నిరతదానములైన – నెఱపలేదు
    పుత్రవంతుడ నంచు – బొగడుచుండగలేదు
    భ్రుత్యవంతుడ నంచు – బొగడలేదు
    శౌర్యవంతుడ నంచు – సంతసింపగలేదు
    కార్యవంతుడ నంచు – గడపలేదు

    తే. నలుగురికి మెప్పుగానైన – నడువలేదు
    నళినదళనేత్ర | నిన్ను నే – నమ్మినాను.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    062
    సీ. అతిలోభులను భిక్ష – మడుగబోవుట రోత
    తనద్రవ్య మొకరింట – దాచ రోత
    గుణహీను డగువాని – కొలువు గొల్చుట రోత
    యొరుల పంచలక్రింద – నుండ రోత
    భాగ్యవంతునితోడ – బంతమాడుట రోత
    గుఱిలేని బంధుల – గూడ రోత
    ఆదాయములు లేక – యప్పుదీయుట రోత
    జార చోరుల గూడి – చనుట రోత

    తే. యాదిలక్ష్మీశ | నీబంట – నైతినయ్య |
    యింక నెడబాసి జన్మంబు – లెత్త రోత.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    063
    సీ. వెఱ్ఱివానికి నేల – వేదాక్షరంబులు?
    మోటువానికి మంచి – పాట లేల?
    పసులకాపరి కేల – పరతత్త్వబోధలు?
    విటకాని కేటికో – విష్ణుకథలు?
    వదరు శుంఠల కేల – వ్రాత పుస్తకములు?
    తిరుగు ద్రిమ్మరి కేల – దేవపూజ?
    ద్రవ్యలోభికి నేల – ధాతృత్వ గుణములు?
    దొంగబంటుకు మంచి – సంగ తేల?

    తే. క్రూరజనులకు నీమీద – గోరి కేల?
    ద్రోహి పాపాత్మునకు దయా – దుఃఖ మేల?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    064
    సీ. నా తండ్రి నాదాత – నాయిష్టదైవమా
    నన్ను మన్ననసేయు – నారసింహ |
    దయయుంచు నామీద – దప్పులన్ని క్షమించు
    నిగమగోచర | నాకు – నీవె దిక్కు
    నే దురాత్ముడ నంచు – నీమనంబున గోప
    గింపబోకుము స్వామి | – కేవలముగ
    ముక్తిదాయక నీకు – మ్రొక్కినందుకు నన్ను
    గరుణించి రక్షించు – కమలనాభ |

    తే. దండిదొర వంచు నీవెంట – దగిలినాను
    నేడు ప్రత్యక్షమై నన్ను – నిర్వహింపు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    065
    సీ. వేమాఱు నీకథల్ – వినుచు నుండెడివాడు
    పరుల ముచ్చటమీద – భ్రాంతి పడడు
    అగణితంబుగ నిన్ను – బొగడ నేర్చినవాడు
    చెడ్డమాటలు నోట – జెప్పబోడు
    ఆసక్తిచేత ని – న్ననుసరించెడివాడు
    ధనమదాంధులవెంట – దగుల బోడు
    సంతసంబున నిన్ను – స్మరణజేసెడివాడు
    చెలగి నీచులపేరు – దలపబోడు

    తే. నిన్ను నమ్మిన భక్తుండు – నిశ్చయముగ
    గోరి చిల్లర వేల్పుల – గొల్వబోడు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    066
    సీ. నే నెంత వేడిన – నీ కేల దయరాదు?
    పలుమాఱు పిలిచిన – బలుక వేమి?
    పలికిన నీ కున్న – పద వేమిబోవు? నీ
    మోమైన బొడచూప – వేమి నాకు?
    శరణు జొచ్చినవాని – సవరింపవలె గాక
    పరిహరించుట నీకు – బిరుదు గాదు
    నీదాసులను నీవు – నిర్వహింపక యున్న
    బరు లెవ్వ రగుదురు – పంకజాక్ష |

    తే. దాత దైవంబు తల్లియు – దండ్రి వీవె
    నమ్మియున్నాను నీపాద – నళినములను.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    067
    సీ. వేదముల్ చదివెడు – విప్రవర్యుండైన
    రణము సాధించెడు – రాజెయైన
    వర్తకకృషికుడౌ – వైశ్యముఖ్యుండైన
    బరిచగించెడు శూద్ర – వర్యుడయిన
    మెచ్చుఖడ్గము బట్టి – మెఱయు మ్లేచ్ఛుండైన
    బ్రజల కక్కఱపడు – రజకుడైన
    చర్మ మమ్మెడి హీన – చండాలనరుడైన
    నీ మహీతలమందు – నెవ్వడైన

    తే. నిన్ను గొనియాడుచుండెనా – నిశ్చయముగ
    వాడు మోక్షాధికారి యీ – వసుధలోన.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    068
    సీ. సకలవిద్యలు నేర్చి – సభ జయింపగవచ్చు
    శూరుడై రణమందు – బోరవచ్చు
    రాజరాజై పుట్టి – రాజ్య మేలగవచ్చు
    హేమ గోదానంబు – లియ్యవచ్చు
    గగనమం దున్న చు – క్కల నెంచగావచ్చు
    జీవరాసుల పేళ్లు – చెప్పవచ్చు
    నష్టాంగయోగము – లభ్యసింపగవచ్చు
    మేక రీతిగ నాకు – మెసవవచ్చు

    తే. తామరసగర్భ హర పురం – దరులకైన
    నిన్ను వర్ణింప దరమౌనె – నీరజాక్ష |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    069
    సీ. నరసింహ | నీవంటి – దొరను సంపాదించి
    కుమతి మానవుల నే – గొల్వజాల
    నెక్కు వైశ్వర్యంబు – లియ్యలేకున్నను
    బొట్టకుమాత్రము – పోయరాదె?
    ఘనముగా దిది నీకు – కరవున బోషింప
    గష్ట మెంతటి స్వల్ప – కార్యమయ్య?
    పెట్టజాలక యేల – భిక్షమెత్తించెదు
    నన్ను బీదను జేసి – నా వదేమి?

    తే. అమల | కమలాక్ష | నే నిట్లు – శ్రమపడంగ
    గన్నులకు బండువై నీకు – గానబడునె?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    070
    సీ. వనరుహనాభ | నీ – వంక జేరితి నేను
    గట్టిగా నను గావు – కావు మనుచు
    వచ్చినందుకు వేగ – వరము లియ్యకకాని
    లేవబోయిన నిన్ను – లేవనియ్య
    గూర్చుండబెట్టి నీ – కొంగు గట్టిగ బట్టి
    పుచ్చుకొందును జూడు – భోగిశయన |
    యీవేళ నీ కడ్డ – మెవరు వచ్చినగాని
    వారికైనను లొంగి – వడకబోను

    తే. గోపగాడను నీవు నా – గుణము తెలిసి
    యిప్పుడే నన్ను రక్షించి – యేలుకొమ్ము.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    071
    సీ. ప్రహ్లాదు డేపాటి – పైడి కానుక లిచ్చె?
    మదగజం బెన్నిచ్చె – మౌక్తికములు?
    నారదుం డెన్నిచ్చె – నగలు రత్నంబు? ల
    హల్య నీ కే యగ్ర – హార మిచ్చె?
    ఉడుత నీ కేపాటి – యూడిగంబులు చేసె?
    ఘనవిభీషణు డేమి – కట్న మిచ్చె?
    పంచపాండవు లేమి – లంచ మిచ్చిరి నీకు?
    ద్రౌపది నీ కెంత – ద్రవ్య మిచ్చె?

    తే. నీకు వీరంద ఱయినట్లు – నేను గాన?
    యెందు కని నన్ను రక్షింప – విందువదన |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    072
    సీ. వాంఛతో బలిచక్ర – వర్తిదగ్గర జేరి
    భిక్షమెత్తితి వేల – బిడియపడక?
    యడవిలో శబరి ది – య్యని ఫలా లందియ్య
    జేతులొగ్గితి వేల – సిగ్గుపడక?
    వేడ్కతో వేవేగ – విదురునింటికి నేగి
    విందుగొంటి వదేమి – వెలితిపడక?
    అడుకు లల్పము కుచే – లుడు గడించుక తేర
    బొక్కసాగితి వేల – లెక్కగొనక?

    తే. భక్తులకు నీవు పెట్టుట – భాగ్యమౌను
    వారి కాశించితివి తిండి – వాడ వగుచు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    073
    సీ. స్తంభమం దుదయించి – దానవేంద్రుని ద్రుంచి
    కరుణతో బ్రహ్లాదు – గాచినావు
    మకరిచే జిక్కి సా – మజము దుఃఖించంగ
    గృపయుంచి వేగ ర – క్షించినావు
    శరణంచు నా విభీ – షణుడు నీ చాటున
    వచ్చినప్పుడె లంక – నిచ్చినావు
    ఆ కుచేలుడు చేరె – డటుకు లర్పించిన
    బహుసంపదల నిచ్చి – పంపినావు

    తే. వారివలె నన్ను బోషింప – వశముగాదె?
    యంత వలపక్ష మేల శ్రీ – కాంత | నీకు?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    074
    సీ. వ్యాసు డే కులమందు – వాసిగా జన్మించె?
    విదురు డే కులమందు – వృద్ధి బొందె?
    గర్ణు డేకులమందు – ఘనముగా వర్ధిల్లె?
    నా వసిష్ఠుం డెందు – నవతరించె?
    నింపుగా వాల్మీకి – యే కులంబున బుట్టె?
    గుహు డను పుణ్యు డే – కులమువాడు?
    శ్రీశుకు డెక్కట – జెలగి జన్మించెను?
    శబరి యేకులమందు – జన్మమొందె?

    తే. నే కులంబున వీ రింద – ఱెచ్చినారు?
    నీకృపాపాత్రులకు జాతి – నీతు లేల?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    075
    సీ. వసుధాస్థలంబున – వర్ణహీనుడు గాని
    బహుళ దురాచార – పరుడు గాని
    తడసి కాసియ్యని – ధర్మశూన్యుడు గాని
    చదువనేరని మూఢ – జనుడు గాని
    సకలమానవులు మె – చ్చని కృతఘ్నుడు గాని
    చూడ సొంపును లేని – శుంఠ గాని
    అప్రతిష్ఠలకు లో – నైన దీనుడు గాని
    మొదటి కే మెఱుగని – మోటు గాని

    తే. ప్రతిదినము నీదు భజనచే – బరగునట్టి
    వాని కే వంక లేదయ్య – వచ్చు ముక్తి.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    076
    సీ. ఇభకుంభములమీది – కెగిరెడి సింగంబు
    ముట్టునే కుఱుచైన – మూషకమును?
    నవచూతపత్రముల్ – నమలుచున్న పికంబు
    గొఱుకునే జిల్లేడు – కొనలు నోట?
    అరవిందమకరంద – మనుభవించెడి తేటి
    పోవునే పల్లేరు – పూలకడకు?
    లలిత మైన రసాల – ఫలము గోరెడి చిల్క
    మెసవునే భమత ను – మ్మెత్తకాయ?

    తే. నిలను నీకీర్తనలు పాడ – నేర్చినతడు
    పరులకీర్తన బాడునే – యరసి చూడ?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    077
    సీ. సర్వేశ | నీపాద – సరసిజద్వయమందు
    జిత్త ముంపగలేను – జెదరకుండ
    నీవైన దయయుంచి – నిలిచి యుండెడునట్లు
    చేరి నన్నిపు డేలు – సేవకుడను
    వనజలోచన | నేను – వట్టి మూర్ఖుడ జుమ్మి
    నీస్వరూపము జూడ – నేర్పు వేగ
    తన కుమారున కుగ్గు – తల్లి వోసినయట్లు
    భక్తిమార్గం బను – పాలు పోసి

    తే. ప్రేమతో నన్ను బోషించి – పెంచుకొనుము
    ఘనత కెక్కించు నీదాస – గణములోన.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    078
    సీ. జీమూతవర్ణ | నీ – మోముతో సరిరాక
    కమలారి యతికళం – కమును బడసె
    సొగసైన నీ నేత్ర – యుగముతో సరిరాక
    నళినబృందము నీళ్ల – నడుమ జేరె
    గరిరాజవరద | నీ – గళముతో సరిరాక
    పెద్దశంఖము బొబ్బ – పెట్ట బొడగె
    శ్రీపతి | నీదివ్య – రూపుతో సరి రాక
    పుష్పబాణుడు నీకు – బుత్రు డయ్యె

    తే. నిందిరాదేవి నిన్ను మో – హించి విడక
    నీకు బట్టమహిషి యయ్యె – నిశ్చయముగ.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    079
    సీ. హరిదాసులను నింద – లాడకుండిన జాలు
    సకల గ్రంథమ్ములు – చదివినట్లు
    భిక్ష మియ్యంగ ద – ప్పింపకుండిన జాలు
    జేముట్టి దానంబు – చేసినట్లు
    మించి సజ్జనుల వం – చించకుండిన జాలు
    నింపుగా బహుమాన – మిచ్చినట్లు
    దేవాగ్రహారముల్ – దీయకుండిన జాలు
    గనకకంబపు గుళ్లు – గట్టినట్లు

    తే. ఒకరి వర్శాశనము ముంచ – కున్న జాలు
    బేరుకీర్తిగ సత్రముల్ – పెట్టినట్లు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    080
    సీ. ఇహలోకసౌఖ్యము – లిచ్చగించెద మన్న
    దేహ మెప్పటికి దా – స్థిరత నొంద
    దాయుష్య మున్న ప – ర్యంతంబు పటుతయు
    నొక్కతీరున నుండ – దుర్విలోన
    బాల్యయువత్వదు – ర్బలవార్ధకము లను
    మూటిలో మునిగెడి – ముఱికికొంప
    భ్రాంతితో దీని గా – పాడుద మనుమొన్న
    గాలమృత్యువుచేత – గోలుపోవు

    తే. నమ్మరా దయ్య | యిది మాయ – నాటకంబు
    జన్మ మిక నొల్ల న న్నేలు – జలజనాభ |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    081
    సీ. వదనంబు నీనామ – భజన గోరుచునుండు
    జిహ్వ నీకీర్తనల్ – సేయ గోరు
    హస్తయుగ్మంబు ని – న్నర్చింప గోరును
    గర్ణముల్ నీ మీది – కథలు గోరు
    తనువు నీసేవయే – ఘనముగా గోరును
    నయనముల్ నీదర్శ – నంబు గోరు
    మూర్ధమ్ము నీపద – మ్ముల మ్రొక్కగా గోరు
    నాత్మ నీదై యుండు – నరసి చూడ

    తే. స్వప్నమున నైన నేవేళ – సంతతమును
    బుద్ధి నీ పాదములయందు – బూనియుండు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    082
    సీ. పద్మాక్ష | మమతచే – బరము నందెద మంచు
    విఱ్ఱవీగుదుమయ్య – వెఱ్ఱిపట్టి
    మాస్వతంత్రంబైన – మదము గండ్లకు గప్పి
    మొగము పట్టదు కామ – మోహమునను
    బ్రహ్మదేవుండైన – బైడిదేహము గల్గ
    జేసివేయక మమ్ము – జెఱిచె నతడు
    తుచ్ఛమైనటువంటి – తో లెమ్ముకలతోడి
    ముఱికి చెత్తలు చేర్చి – మూట కట్టె

    తే. నీ శరీరాలు పడిపోవు – టెఱుగ కేము
    కాముకుల మైతి మిక మిమ్ము – గానలేము.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    083
    సీ. గరుడవాహన | దివ్య – కౌస్తుభాలంకార |
    రవికోటితేజ | సా – రంగవదన |
    మణిగణాన్విత | హేమ – మకుటాభరణ | చారు
    మకరకుండల | లస – న్మందహాస |
    కాంచనాంబర | రత్న – కాంచివిభూషిత |
    సురవరార్చిత | చంద్ర – సూర్యనయన |
    కమలనాభ | ముకుంద | – గంగాధరస్తుత |
    రాక్షసాంతక | నాగ – రాజశయన |

    తే. పతితపావన | లక్షీశ | – బ్రహ్మజనక |
    భక్తవత్సల | సర్వేశ | – పరమపురుష |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    084
    సీ. పలుమాఱు దశరూప – ములు దరించితి వేల?
    యేకరూపము బొంద – వేల నీవు?
    నయమున క్షీరాబ్ధి – నడుమ జేరితి వేల?
    రత్నకాంచన మంది – రములు లేవె?
    పన్నగేంద్రునిమీద – బవ్వళించితి వేల?
    జలతారుపట్టెమం – చములు లేవె?
    ఱెక్కలు గలపక్షి – నెక్కసాగితి వేల?
    గజతురంగాందోళి – కములు లేవె?

    తే. వనజలోచన | యిటువంటి – వైభవములు
    సొగసుగా నీకు దోచెనో – సుందరాంగ?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    085
    సీ. తిరుపతి స్థలమందు – దిన్నగా నే నున్న
    వేంకటేశుడు మేత – వేయలేడొ?
    పురుషోత్తమమున కే – బోయనజాలు జ
    గన్నాథు డన్నంబు – గడపలేడొ?
    శ్రీరంగమునకు నే – జేర బోయిన జాలు
    స్వామి గ్రాసము బెట్టి – సాకలేడొ?
    కాంచీపురములోన – గదిసి నే గొలువున్న
    గరివరదుడు పొట్ట – గడపలేడొ?

    తే. యెందు బోవక నేను నీ – మందిరమున
    నిలిచితిని నీకు నామీద – నెనరు లేదు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    086
    సీ. తార్క్ష్యవాహన | నీవు – దండిదాత వటంచు
    గోరి వేడుక నిన్ను – గొల్వవచ్చి
    యర్థిమార్గమును నే – ననుసరించితినయ్య
    లావైన బదునాల్గు – లక్ష లైన
    వేషముల్ వేసి నా – విద్యాప్రగల్భత
    జూపసాగితి నీకు – సుందరాంగ |
    యానంద మైన నే – నడుగ వచ్చిన దిచ్చి
    వాంఛ దీర్పుము – నీలవర్ణ | వేగ

    తే. నీకు నావిద్య హర్షంబు – గాక యున్న
    తేపతేపకు వేషముల్ – దేను సుమ్మి.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    087
    సీ. అమరేంద్రవినుత | నే – నతిదురాత్ముడ నంచు
    గలలోన నైనను – గనుల బడవు
    నీవు ప్రత్యక్షమై – నులువకుండిన మానె
    దొడ్డగా నొక యుక్తి – దొరకెనయ్య |
    గట్టికొయ్యను దెచ్చి – ఘనముగా ఖండించి
    నీస్వరూపము చేసి – నిలుపుకొంచు
    ధూప దీపము లిచ్చి – తులసితో బూజించి
    నిత్యనైవేద్యముల్ – నేమముగను

    తే. నడుపుచును నిన్ను గొలిచెద – నమ్మి బుద్ధి
    నీ ప్రపంచంబు గలుగు నా – కింతె చాలు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    088
    సీ. భువనేశ | గోవింద | – రవికోటిసంకాశ |
    పక్షివాహన | భక్త – పారిజాత |
    యంభోజభవ రుద్ర – జంభారిసన్నుత |
    సామగానవిలోల | – సారసాక్ష |
    వనధిగంభీర | శ్రీ – వత్సకౌస్తుభవక్ష |
    శంఖచక్రగదాసి – శార్ఙ్ఞహస్త |
    దీనరక్షక | వాసు – దేవ | దైత్యవినాశ |
    నారదార్చిత | దివ్య – నాగశయన |

    తే. చారు నవరత్నకుండల – శ్రవణయుగళ |
    విబుధవందిత పాదబ్జ | – విశ్వరూప |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    089
    సీ. నాగేంద్రశయన | నీ – నామమాధుర్యంబు
    మూడుకన్నుల సాంబ – మూర్తి కెఱుక
    పంకజాతాక్ష | నీ – బలపరాక్రమ మెల్ల
    భారతీపతి యైన – బ్రహ్మ కెఱుక
    మధుకైటభారి | నీ – మాయాసమర్థత
    వసుధలో బలిచక్ర – వర్తి కెఱుక
    పరమాత్మ | నీ దగు – పక్షపాతిత్వంబు
    దశశతాక్షుల పురం – దరుని కెఱుక

    తే. వీరి కెఱుకగు నీకథల్ – వింత లెల్ల
    నరుల కెఱు కన్న నెవరైన – నవ్విపోరె?
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    090
    సీ. అర్థు లేమైన ని – న్నడుగవచ్చెద రంచు
    క్షీరసాగరమందు – జేరినావు
    నీచుట్టు సేవకుల్ – నిలువకుండుటకునై
    భయదసర్పముమీద – బండినావు
    భక్తబృందము వెంట – బడి చరించెద రంచు
    నెగసి పోయెడిపక్షి – నెక్కినావు
    దాసులు నీద్వార – మాసింపకుంటకు
    మంచి యోధుల కావ – లుంచినావు

    తే. లావు గలవాడ వైతి వే – లాగు నేను
    నిన్ను జూతును నాతండ్రి | – నీరజాక్ష |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    091
    సీ. నీకథల్ చెవులలో – సోకుట మొదలుగా
    బులకాంకురము మెన – బుట్టువాడు
    నయమైన నీ దివ్య – నామకీర్తనలోన
    మగ్నుడై దేహంబు – మఱచువాడు
    ఫాలంబుతో నీదు – పాదయుగ్మమునకు
    బ్రేమతో దండ మ – ర్పించువాడు
    హా పుండరీకాక్ష | – హా రామ | హరి | యంచు
    వేడ్కతో గేకలు – వేయువాడు

    తే. చిత్తకమలంబునను నిన్ను – జేర్చువాడు
    నీదులోకంబునం దుండు – నీరజాక్ష |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    092
    సీ. నిగమగోచర | నేను – నీకు మెప్పగునట్లు
    లెస్సగా బూజింప – లేను సుమ్మి
    నాకు దోచిన భూష – ణములు పెట్టెద నన్న
    గౌస్తుభమణి నీకు – గలదు ముందె
    భక్ష్యభోజ్యముల న – ర్పణము జేసెద నన్న
    నీవు పెట్టితి సుధ – నిర్జరులకు
    గలిమికొద్దిగ గాను – కల నొసంగెద నన్న
    భార్గవీదేవి నీ – భార్య యయ్యె

    తే. నన్ని గలవాడ వఖిల లో – కాధిపతివి |
    నీకు సొమ్ములు పెట్ట నే – నెంతవాడ |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    093
    సీ. నవసరోజదళాక్ష | – నన్ను బోషించెడు
    దాతవు నీ వంచు – ధైర్యపడితి
    నా మనంబున నిన్ను – నమ్మినందుకు దండ్రి |
    మేలు నా కొనరింపు – నీలదేహ |
    భళిభళీ | నీ యంత – ప్రభువు నెక్కడ జూడ
    బుడమిలో నీ పేరు – పొగడవచ్చు
    ముందు జేసిన పాప – మును నశింపగ జేసి
    నిర్వహింపుము నన్ను – నేర్పుతోడ

    తే. బరమసంతోష మాయె నా – ప్రాణములకు
    నీ‌ఋణము దీర్చుకొన నేర – నీరజాక్ష |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    094
    సీ. ఫణులపుట్టలమీద – బవ్వళించినయట్లు
    పులుల గుంపున జేర – బోయినట్లు
    మకరివర్గం బున్న – మడుగు జొచ్చినయట్లు
    గంగదాపున నిండ్లు – గట్టినట్లు
    చెదలభూమిని జాప – చేర బఱచినయట్లు
    ఓటిబిందెల బాల – నునిచినట్లు
    వెఱ్ఱివానికి బహు – విత్త మిచ్చినయట్లు
    కమ్మగుడిసె మందు – గాల్చినట్లు

    తే. స్వామి నీ భక్తవరులు దు – ర్జనులతోడ
    జెలిమి జేసినయ ట్లైన – జేటు వచ్చు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    095
    సీ. దనుజసంహార | చక్ర – ధర | నీకు దండంబు
    లిందిరాధిప | నీకు – వందనంబు
    పతితపావన | నీకు – బహునమస్కారముల్
    నీరజాతదళాక్ష | – నీకు శరణు
    వాసవార్చిత | మేఘ – వర్ణ | నీకు శుభంబు
    మందరధర | నీకు – మంగళంబు
    కంబుకంధర | శార్జ్గ – కర | నీకు భద్రంబు
    దీనరక్షక | నీకు – దిగ్విజయము

    తే. సకలవైభవములు నీకు – సార్వభౌమ |
    నిత్యకల్యాణములు నగు – నీకు నెపుడు.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    096
    సీ. మత్స్యావతార మై – మడుగులోపల జొచ్చి
    సోమకాసురు ద్రుంచి – చోద్యముగను
    దెచ్చి వేదము లెల్ల – మెచ్చ దేవతలెల్ల
    బ్రహ్మ కిచ్చితి వీవు – భళి | యనంగ
    నా వేదముల నియ్య – నాచారనిష్ఠల
    ననుభవించుచు నుందు – రవనిసురులు
    సకలపాపంబులు – సమసిపోవు నటంచు
    మనుజు లందఱు నీదు – మహిమ దెలిసి

    తే. యుందు రరవిందనయన | నీ – యునికి దెలియు
    వారలకు వేగ మోక్షంబు – వచ్చు ననఘ |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    097
    సీ. కూర్మావతారమై – కుధరంబుక్రిందను
    గోర్కితో నుండవా – కొమరు మిగుల?
    వరహావతారమై – వనభూములను జొచ్చి
    శిక్షింపవా హిర – ణ్యాక్షు నపుడు?
    నరసింహమూర్తివై – నరభోజను హిరణ్య
    కశిపుని ద్రుంపవా – కాంతి మీఱ?
    వామనరూపమై – వసుధలో బలిచక్ర
    వర్తి నఱంపవా – వైర ముడిగి?

    తే. యిట్టి పను లెల్ల జేయగా – నెవరికేని
    తగునె నరసింహ | నీకిది – దగును గాక |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    098
    సీ. లక్ష్మీశ | నీదివ్య – లక్షణగుణముల
    వినజాల కెప్పుడు – వెఱ్ఱినైతి
    నా వెఱ్ఱిగుణములు – నయముగా ఖండించి
    నన్ను రక్షింపు మో – నళిననేత్ర |
    నిన్ను నే నమ్మితి – నితరదైవముల నే
    నమ్మలే దెప్పుడు – నాగశయన |
    కాపాడినను నీవె – కష్టపెట్టిన నీవె
    నీపాదకమలముల్ – నిరత మేను

    తే. నమ్మియున్నాను నీపాద – నళినభక్తి
    వేగ దయచేసి రక్షింపు – వేదవిద్య |
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    099
    సీ. అమరేంద్రవినుత | ని – న్ననుసరించినవారు
    ముక్తి బొందిరి వేగ – ముదముతోను
    నీపాదపద్మముల్ – నెఱ నమ్మియున్నాను
    నాకు మోక్షం బిమ్ము – నళిననేత్ర |
    కాచి రక్షించు నన్ – గడతేర్చు వేగమే
    నీ సేవకుని జేయు – నిశ్చలముగ
    గాపాడినను నీకు – గైంకర్యపరుడ నై
    చెలగి నీపనులను – జేయువాడ

    తే. ననుచు బలుమాఱు వేడెద – నబ్జనాభ |
    నాకు బ్రత్యక్ష మగుము నిన్ – నమ్మినాను.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    100
    సీ. శేషప్ప యను కవి – చెప్పిన పద్యముల్
    చెవుల కానందమై – చెలగుచుండు
    నే మనుజుండైన – నెలమి నీ శతకంబు
    భక్తితో విన్న స – త్ఫలము గలుగు
    జెలగి యీ పద్యముల్ – చేర్చి వ్రాసినవారు
    కమలాక్షుకరుణను – గాంతు రెపుడు
    నింపుగా బుస్తకం – బెపుడు బూజించిన
    దురితజాలంబులు – దొలగిపోవు

    తే. నిద్ది పుణ్యాకరం బని – యెపుడు జనులు
    గషట మెన్నక పఠియింప – గలుగు ముక్తి.
    భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
    దుష్టసంహార | నరసింహ – దురితదూర |

    Share. Facebook Twitter LinkedIn Email

    ఇంకా చదవండి

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    గణపతి తాళం – మూలం మరియు ప్రాముఖ్యత

    September 21, 2026
    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (110)
    • అష్టోత్తరం (42)
    • గణపతి 32 నామాలు లేదా రూపాలు (32)
    • డౌన్లోడ్స్ (3)
    • దేవాలయాలు (7)
    • దేవి మహాత్మ్యం (17)
    • పూజ (13)
    • భక్తి (178)
    • భగవత్ గీత (18)
    • మన పండుగలు (36)
    • ముఖ్యం (2)
    • విజ్ఞానం (21)
    • స్తోత్రాలు (53)
    Don't Miss

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026 భక్తి

    పోలేరమ్మ తల్లి అనేక ప్రాంతాల్లో గ్రామదేవతగా భక్తిశ్రద్ధలతో పూజలందుకుంటారు. గ్రామ ప్రజల క్షేమం, కుటుంబాల శ్రేయస్సు, పంటల అభివృద్ధి, సుఖసంతోషాల…

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య

    September 22, 2026

    దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు

    September 21, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.