పూర్తి వినాయక వ్రతకల్పము & పూజా విధానం చదవండి పసుపు గణపతి పూజ · ఏకవింశతి పత్ర పూజ · అష్టోత్తర శతనామావళి · వ్రతకథ చదవండి
వినాయక వ్రతకథా ప్రారంభము
శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండగు భగవంతుని సృష్టిని శ్రేష్ఠమగు ఈ భరతఖండమున ఉత్తరభాగమునందు ఆర్యావర్తమను పుణ్యభూమి యొప్పు చుండె. అందు కల్హార కేదార కరవీర జాజి విరజాజి జపాపాటలీ కేతకీ నాగ పున్నాగ మల్లికా మతల్లికా కుంద కురవక మందార చంపక చాంపేయాది అనేక పుష్పరాజి విరాజితమును, సాల రసాల తాల హింతాల తమాల తక్కోల చూత పూగ వకుళ అశోక కపిత్థ అశ్వత్థ ప్లక్షకాది అనేక వృక్ష శోభితంబును, హంస కారండవ చక్రవాక జలకుక్కుట కోకిలాద్యనేక పక్షి కృత కోలాహల నివహంబును, నిర్మల ప్రవాహ రమణీయ సరోవరయుక్తంబును, ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యష్టాంగ యోగ నిష్ఠాగరిష్ఠ హరిహర పూజా మకరంద పానానంద తుందిల హృదయారవింద మునివర్య దివ్యా శ్రమ విలసితంబు నగు నైమిశారణ్యంబు వెలయుచుండె.
అందనేక ధర్మశాస్త్ర పురాణేతిహాసంబుల జెప్పు పౌరాణికుండగు సూతుండు శౌనకాది మునులకనేక శాస్త్రమ్బులు బోధించుచుండెను, ఇట్లుండిన చంద్రవంశంబునందు బుట్టిన ధర్మరాజు దైవయోగము వలన జ్ఞాతులచే రాజ్యమును పోగొట్టుకొని అనేక వృక్ష పక్షి మృగంబులుగల యడవి ప్రవేశించి, అందువారు వాయుభక్షకులుగను, పర్ణభక్షకులుగను తపంబు చేయుచుండెడి మహాత్ములకు ఋషులన్ జూచుచు సూతునియెడకు పోయి భార్యానుజుల తోడ నమస్కరించి ధర్మరాజున్ డిట్లనియె ,”ఓ మహాత్మా! మేము జ్ఞాతులచే రాజ్యమును,సంపత్తును గోలుపోయి వచ్చినారము. మీ దర్శన మాత్రంబున సకల పాపంబులు నశించి, మాయందు కృప గలిగి మరల రాజ్యాదులు గలుగునట్టి యొక వ్రతంబానతీయవలయునని ” వేడగా సూతుండు ఇట్లనియే, “ధర్మరాజా! సమస్త పాపంబులం పోగొట్టి పుత్రపౌత్రాది వృద్ధింజేయు రహస్యమైన యొక వ్రతము గలదు. దానిని తొల్లి సాంబశివుండు కుమారస్వామి కుపదేశించె. అదెట్లనిన ప్రమథగణాధిప సేవితంబును, నానారత్న విభూషితంబునగు కైలాస పర్వతంబు నందలి మందారవృక్ష సమీపంబున స్వర్ణ సింహాసనమందు పరమశివుండు కూర్చుండియుండిన, షణ్ముఖుడు ఏతెంచి ఇట్లనే, “ఓ నీలకంఠా! లోకంబున నుండు మనుజులే వ్రతంబు చేసినట్లైన పుత్రపౌత్రాదుల జెంది సుఖంబుగా నుందురో అట్టి వ్రతంబును జెప్పు” మనిన శివుండు, “ఓ కుమారస్వామీ!ఆయువును సర్వసంపత్తును వృద్ధిజేసెడి వినాయక వ్రతం ఒకటి కలదు. ఆ వ్రతంబును భాద్రపద మాస శుక్ల పక్ష చవితినాడు చేయవలెను. నాడు ప్రాతఃకాలమున స్నానము చేసి శుచిర్భూతుడై నిత్యకర్మల నెరవేర్చుకొని తన శక్తికొలది బంగారుతో నైనను, వెండితోనైనను, లేక మట్టితోనైనను విఘ్నేశ్వర ప్రతిమను చేసి గృహొత్తర ప్రదేశమున మండపం బేర్పరచి యందు పండ్లుగాని, బియ్యముగాని పోసి అష్టదళపద్మం బేర్పరచి గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేతగంధాక్షత పుష్పములతో పూజించి ధూపదీపములు సమర్పించి కుడుములు మొదలైన పిండివంటలు, టెంకాయలు, అరటిపండ్లు, నేరేడు పండ్లు, చెరుకు మొదలైన ఫలములను ప్రత్యక్షముగా దినుసున ఇదువది ఒక్కటి ప్రకారము నైవేద్యముచేసి, నృత్యగీతవాద్య పురాణ పఠనాదులతో గణపతిపూజ సమాప్తమొందించి, యథాశక్తిగా వేద విధులైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలిచ్చి బంధువులతోడ ఘృతపక్వములైన భక్ష్యభోజ్యాదులచే భుజింపవలెను. ఈ ప్రకారం బెవ్వరు గణపతికి సేవ చేయుచున్నారో వారికి గణపతి వరప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. ఇందుకు సంశయము లేదు.
మరునాడుదయముననే నిద్ర లేచి స్నానాదులం గావించి పునః పూజ యొనర్చి వారివారి ఇష్టానుసారము గణనాధునికి మౌన్జీ కృష్ణాజిన దండ యజ్ఞోపవీత కమండలు వస్త్రములను సమర్పించి, పురోహితులకు వస్త్రముల దక్షిణ తాంబూలములనిచ్చి, ఇతర విప్రులను దక్షిణ తాంబూల భోజనాదులచే తృప్తులం చేయవలయును. కుమార స్వామి! వ్రతములలో నుత్తమంబైన యీ వ్రతరాజము మూడు లోకములయందును ప్రసిద్ధిజెంది గరుడ, గంధర్వ, కిన్నర కింపురుషాదులచే సదా యాచరింపబడిన” దని స్కంధునకు పరమశివుండు ఉపదేశించెను.
కావున ఓ ధర్మరాజా! నీవును ఈ వ్రతమును చేసితివేని శత్రువులను జయించి సుఖముగ నుందువు. మరియూ, తొలీ ఈ వ్రతమును దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లాడెను. శ్రీకృష్ణుడు ఆచరించి శమంతకమణి తోడం జాంబవతిని బొందెను. అదెట్లనిన సత్రాజిత్తను నరేంద్రుండు సూర్యుని వరముచే శమంతకమణిని బొంది శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకుం బోవ, రెండవ సూర్యునివలె ప్రకాశించుచున్న శమంతక మణిని శ్రీకృష్ణుడు అడుగగా, దానిని సత్రాజిత్త ఇవ్వక తన యూరికిం బోయె, పిదప సత్రాజిత్తు తమ్ముడా మణిని ధరించుకొని వేటకు బోవగా అచటనొక సింహము వానిని వధించి ఆ మణి ఎత్తుకుపోవుచుండగా, జాంబవంతుండు దానిని హతంబొనర్చి, ఆ మణిని తన గుహకుం దీసికొనిపోయె. ఈ సంగతి లోకులకు తెలియమింజేసి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని తమ్మునిన్ దునిమి ఆ శమంతక మణి ని అపహరించెనని చెప్పుకొనుచుండ, శ్రీకృష్ణుడు తాను వినాయకునిచే శపించబడిన చవితిచంద్రుని శ్రీకృష్ణుడు క్షీరఘటమందు చూచుటచేతనే తనకట్టి యపవాదము సంభవించెనని బలభద్రునితో జెప్పె.
అతండు చవితి చంద్రునకు వినాయకుండు ఎట్లు శాపంబిడెనని యడుగగా, కృష్ణమూర్తి యిట్టులనియే: “అన్నా! కైలాసమున ఒకనాడు వినాయకుండు కుబ్జరూప ధరుండై ప్రకాశించుచుండ నతన్ని చూచి చంద్రుండు నవ్వె. అంత వినాయకుండు చంద్రుని జూచి “ఓరి! నిన్ను ఈ చవితిదినమున నెవ్వరైన జూచిరేని వారి కపవాదము సిద్ధించును,”అని శపించె, చంద్రుండు అతి దీనుండైప్రార్థింప, వినాయకుండు, ‘స్కందునకు సాంబశివున్ డానతిచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధచవితి దినమందు నన్ను యథావిధి గా అర్చించి వ్రతము సలిపిరేని అట్టివారికి సంభవించిన యపవాదము తొలగి, శతృజయ మును, మోక్ష సామ్రాజ్యసిద్ధియూ, పుత్రపౌత్ర గోమహిషాద్యభివృద్ధి గలుగు నని చంద్రునకుం జెప్పె. అంత చంద్రుండు మొదలగు వారీ వ్రతమును చేసి” రని కృష్ణుడు బలభద్రునితో జెప్పె.
బలభద్రుండు తన పురమునందెల్ల వారును ఈ వ్రతమును సల్పునటుల జేసి, దానును, కృష్ణమూర్తియూ యథావిధి వ్రతంబొనర్చి వినాయకుని ప్రసాదముచే జాంబవంతుని చెంతకుం బోవ నతడు జాంబవతియను తన కూతురును కృష్ణమూర్తికి ఇచ్చి వివాహము చేసి, శమంతకమణిని గూడ నొసంగిన, నా రత్నమును వాసుదేవుండు సత్రాజిత్తుని కిచ్చిన, నతండు సత్యభామ యను కూతురు నివ్వగా, దానిని వివాహమాడి కృష్ణుడు సుఖముగా నుండె.
మరియు వృత్రాసురుని హతం బొనర్చునపుడు ఇంద్రుండును, సీతాదేవిని వెదకునప్పుడు శ్రీరాముండును, గంగను భూమికి తెచ్చునప్పుడు భగీరథుండును, నమృతోత్పాదనము సేయునప్పుడు దేవాసురులను, కుష్ఠు వ్యాధి నివృత్తికొరకు సాంబుండును వినాయక వ్రతమును జేసిరి.” అని నుడివిన ధర్మరాజును నీ వ్రతమును సలిపి శత్రువుల జయించి రాజ్యములను పొం నాది సుఖముగ నుండె.
కావున, మనసున తలచిన కార్యము లన్నియు వినాయక వ్రతము సలుపుట వలన సిద్ధియించుటచే గణపతి సిద్ధివినాయకుండని ప్రసిద్ధి జెందె. విద్యారంభకాలమున పూజించిన విద్యాలాభంబు గలుగును. పుత్రార్థ కాముకులు పుత్రార్థములను బడయుదురు. కన్య పూజించినచే చక్కని భర్తను — ముత్తయిదువ పూజించినచే నిత్యసౌభాగ్యము ను పొందుదురు. విధవ పూజించినచే మరి ఏ జన్మమందును వైధవ్యమును పొందదు. కావున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు యథావిధిగా నీ వ్రతం బాచరించిన శ్రీగణపతి యనుగ్రహమున సకలైశ్వర్యములం బొంది సుఖముగ నుందురుగాక.
వినాయక వ్రతకథ సమాప్తము.
