పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు? / Why groom father takes all marriage expenses

ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదని శాస్త్రం చెప్తుంది.

కన్యాదాత (తండ్రి) దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మగపిల్లవాడిని వంశోద్ధారకుడనే భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి మగపిల్లాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తలవంచాలిగా?

కాబట్టి ఇప్పుడు కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి?

“సీతారాములలా ఉండండి!” అని వధూవరులను ఆశీర్వదిస్తాం. జనక మహారాజు, దశరథ మహారాజుని అడుగుతారు “మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?” అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? “అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది” అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు.

అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి.

ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!