Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    sample

    August 23, 2026

    శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

    August 17, 2026

    శ్రీ వరలక్ష్మీ వ్రతం – శుక్రవారం, 21, 28 ఆగస్టు, 2026

    August 17, 2026
    Facebook Instagram YouTube
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతం – శుక్రవారం, 21, 28 ఆగస్టు, 2026

      August 17, 2026

      శ్రావణ మాసం- గురువారం 13 ఆగస్టు , 2026 – శుక్రవారం సెప్టెంబర్ 11, 2026

      August 12, 2026

      నాగ పంచమి – సోమవారం, 17 ఆగస్టు, 2026

      August 12, 2026

      ఆగస్టు 28 చంద్రగ్రహణం: రాఖీ పండుగ జరుపుకునే ఉత్తమ సమయం

      August 12, 2026
    • భక్తి

      sample

      August 23, 2026

      సూర్యగ్రహణం – బుధవారం, 12 ఆగస్టు 2026

      August 12, 2026

      శ్రావణ మాసం- గురువారం 13 ఆగస్టు , 2026 – శుక్రవారం సెప్టెంబర్ 11, 2026

      August 12, 2026

      గురు పౌర్ణమి / Guru Purnima – జూలై 29, బుధవారం 2026

      July 18, 2026

      ద్వాదశాదిత్య ధ్యాన శ్లోకాలు / Dwadashāditya meditation verses

      January 25, 2026
    • విజ్ఞానం
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    Home » సుమతీ సతకములు/sumati satakam
    విజ్ఞానం

    సుమతీ సతకములు/sumati satakam

    By JosyulaJuly 9, 2021Updated:August 22, 2026No Comments14 Mins Read
    Share Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Follow Us
    Google News Flipboard Threads
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    స్త్రీల ఎడ వాదులాడక
    బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ
    మేలైన గుణము విడువకు
    ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!
    తాత్పర్యం: స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు.

    సిరి దా వచ్చిన వచ్చును
    సలలితముగ నారికేళ సలిలము భంగిన్
    సిరి దాఁ బోయిన బోవును
    కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
    తాత్పర్యం: సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది.

    మేలెంచని మాలిన్యుని
    మాలను నగసాలివాని మంగలి హితుగా
    నేలిన నరపతి రాజ్యము
    నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!
    తాత్పర్యం: ఉపకారాన్ని గుర్తుంచుకోని దుర్మార్గుడ్ని, పంచముని, కంసాలివానిని, మంగలిని హితలుగా చేసుకొని పాలించే రాజు రాజ్యము మట్టిలో కలిసి నాశనం అవుతుంది కానీ కీర్తిని పొందదు.

    సరసము విరసము కొరకే
    పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే
    పెరుగుట విరుగుట కొరకే
    ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!
    తాత్పర్యం: హాస్యపు మాటలు విరోధము కొరకే. సంపూర్ణ సౌఖ్యాలు విస్తారమైన బాధల కోసమే. పొడవుగా ఎదుగుట విరిగిపోవడానికే. ధరవరలు తగ్గడం మళ్లీ పెరగడానికే అని మనుషులు తెలుసుకోవాలి.

    శుభముల నొందని చదువును
    అభినయమున రాగరసము నందని పాటల్
    గుభగుభలు లేని కూటమి
    సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!
    తాత్పర్యం: శుభాలు పొందని విద్య, నటన, సంగీత, సామరస్యంతో కూడిన పాటలు, సందడి లేని కలయిక, సభల్లో మెప్పు పొందని మాటలు రుచించవు. చప్పనయినవి.

    వేసరవు జాతి కానీ
    వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ
    దాసి కొడుకైన గాని
    కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!
    తాత్పర్యం: నీచ జాతివాడైనా, నిష్ప్రయోజకుడైనా, దాసీ పుత్రుడైనా ధనం కలవాడే అధిపతి

    వెలయాలు సేయు బాసలు
    వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్
    గలలోఁన గన్న కలిమియు,
    విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
    తాత్పర్యం: వేశ్య ప్రమాణాలు, విశ్వబ్రాహ్మణుని స్నేహం, వెలమదొరల జత, కలలో చూసిన సంపదలను స్పష్టంగా నమ్మరాదు.

    వెలయాలివలనఁ గూరిమి
    గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా
    పలువురు నడిచెడి తెరుపునఁ
    బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!
    తాత్పర్యం:పదిమంది నడిచే బాటలో పచ్చగడ్డి మొలవదు. ఒకవేళ మొలిచినా పెరగదు. ఆ విధంగానే వేశ్యవల్ల ప్రేమ లభించదు. ఒకవేళ లభించినా ఎక్కువకాలం నిలవదు.

    వీడెము సేయని నోరును
    జేడెల యధరామృతంబుఁ జేయని నోరును
    బాడంగరాని నోరును
    బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
    తాత్పర్యం: తాంబూలం వేసుకోని, స్త్రీల అధరామృత పానం చేయని, గానం చేయని నోరు పెంట బూడిద పోసుకొనే గోయితో సమానం సుమా!

    వినదగు నెవ్వరుచెప్పిన
    వినినంతనె వేగపడక వివరింపదగున్
    కనికల్ల నిజము దెలిసిన
    మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!
    తాత్పర్యం: ఎవరు ఏం చెప్పినా వినవచ్చు. విన్నా వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది నిజమో అబద్దమో తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు.

    వరి పంటలేని యూరును
    దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్
    ధరను బతిలేని గృహమును
    అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
    తాత్పర్యం: ధాన్యం పంటలేని గ్రామం, రాజు నివశింపని నగరం, సహాయం దొరకని మార్గం, భర్త (రాజు)లేని గృహం ఆలోచించగా స్మశానంతో సమానమని చెప్పవచ్చు.

    వరదైన చేను దున్నకు
    కరవైనను బంధుజనుల కడకేగకుమీ
    పరులకు మర్మము సెప్పకు
    పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
    తాత్పర్యం: వరద ముంచిన చేనును దున్నవద్దు. కూడు కరవైనను బంధువుల ఇంటికి పోవద్దు. ఇతరులకు రహస్యాల్ని చెప్పవద్దు. పిరికివాడికి సేనానాయక పదవిని ఇయ్యవద్దు.

    లావుగలవానికంటెను
    భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
    గ్రావంబంత గజంబును
    మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
    తాత్పర్యం: పెద్ద పర్వతమంటి ఏనుగుకంటే చిన్నవాడైన మావటి లోబరుచుకుని ఎక్కుచున్నాడు కనక మావటి గొప్పవాడు. అలాగే శరీరబలం కలవాని కంటే బుద్ధిబలం కలవాడే నిజమైన బలవంతుడు.

    రూపించి పలికి బొంకకు
    ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
    గోపించురాజుఁ గొల్వకు
    పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ!
    తాత్పర్యం: సాక్షులతో నిర్ధారణ చేసి అబద్ధాన్ని నిజమని స్థిరపరచడం, ఆప్తబంధువులను నిందించడం, కోపిని సేవించడం, పాపభూమికి వెళ్లడం తగని పనులు. కావున ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

    రా పొమ్మని పిలువని యా
    భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే
    దీపంబు లేని ఇంటను
    చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!
    తాత్పర్యం: దీపంలేని ఇంట్లో చేవుణికీళ్లాట ఆడితే ఏవిధంగా ఆనందం కలగదో ఆ విధంగానే రమ్మని కానీ పొమ్మని కానీ చెప్పని రాజును సేవించడం వల్ల జీవమూ లేదు. మోక్షమూ లేదు. వట్టి నిష్ప్రయోజనం.

    నాది నొకని వలచియుండగ
    మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్
    బొది జిలుక పిల్లి పట్టిన
    జదువునె యా పంజరమున జగతిని సుమతీ!
    తాత్పర్యం: పిల్లి పంజరాన్ని పట్టుకుంటే ఆ పంజరంలో ఉన్న చిలుక మాట్లాడుతుందా? అలాగే, మనసులో ఒకతన్ని ప్రేమించిన స్త్రీ విటుడు ఎంత బతిమాలినా ప్రేమించదు.

    మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
    హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
    మానెడు జలములలోపల
    నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!
    తాత్పర్యం: అభిమాన శ్రేష్టుడు మనోధైర్యం చెడి అల్పుని ఆశ్రయించడం మానెడు నీళ్లలో ఏనుగు తన శరీరాన్ని మరుగుపరచినట్లుండును.

    మాటకు బ్రాణము సత్యము
    కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
    బోటికిఁ బ్రాణము మానము
    చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
    తాత్పర్యం: నోటిమాటకు సత్యం, పెద్ద దుర్గానికి గొప్ప సైన్య సమూహం, స్త్రీకి అభిమానం, పత్రానికి చేవ్రాలు ముఖ్యమైన ఆధారాలు.

    మంత్రిగలవాని రాజ్యము
    తంత్రము సెడకుండ నిలచుఁ దరచుగ ధరలో
    మంత్రి విహీనుని రాజ్యము
    జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ!
    తాత్పర్యం: సమర్థుడైన మంత్రి ఉంటే సామ, దాన, భేద, దండ వంటి ఉపాయాలు పాడుకాకుండా సాగిపోతాయి. అలాంటి మంత్రి లేకపోతే కీలూడిపోయిన యంత్రంలా ముందుకు సాగవు.

    మండలపతి సముఖంబున
    మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్
    గొండంత మదపుటేనుగు
    తొండము లేకుండినట్లు తోచుర సుమతీ!
    తాత్పర్యం: కొండంత పెద్దదైన ఏనుగు అయినా తొండం లేకపోతే ఎలా శోభావిహీనంగా ఉంటుందో అలాగే, గొప్ప దేశాన్ని పరిపాలించే రాజు దగ్గర సమర్థుడైన మంత్రి లేకపోతే అతని పాలన అంతే శోభావిహీనమవుతుంది.

    బలవంతుడ నాకేమని
    పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
    బలవంతమైన సర్పము
    చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!
    తాత్పర్యం: నేను చాలా బలవంతుడ్ని. నాకేమీ భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి విరోధం తెచ్చుకోవడం మంచిది కాదు. అది ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావడం లేదా?

    బంగారు కుదువబెట్టకు
    సంగరమునఁ బారిపోకు సరసుఁడవగుచో
    నంగడి వెచ్చములాడకు
    వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ!
    తాత్పర్యం: బంగారు నగలను తాకట్టు పెట్టవద్దు. యుద్ధభూమి నుంచి వెన్నిచ్చి పారిపోవద్దు. దుకాణం నుంచి సరకులు అరువు తెచ్చుకోవద్దు. మూఢునితో స్నేహం చేయవద్దు.

    పొరుగున పగవాడుండిన
    నిర వొందగ వ్రాతగాఁడె ఏలికయైనన్
    ధరఁగాఁపు కొండెమాడినఁ
    గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!
    తాత్పర్యం: ఇంటి పక్కనే శతృవు ఉన్నా, బాగా రాయగలవాడే ప్రభువు అయినా, గ్రామ పెత్తందారు కొండెములు చెప్పేవాడయినా లేఖరుకు జీవితం గడవదు.

    పెట్టిన దినములలోపల
    నట్టడవులకైనవచ్చు నానార్థములున్
    బెట్టని దినములఁ గనకపు
    గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!
    తాత్పర్యం: అదృష్టం కలసివచ్చిన రోజుల్లో అడవి మధ్యలో ఉన్నా అన్ని సంపదలూ అక్కడికే వస్తాయి. దురదృష్టం వెన్నాడేటపుడు బంగారు పర్వతాన్ని ఎక్కినా ఏమీ లభించదు.

    పులిపాలు దెచ్చిఇచ్చిన
    నలవడఁగ గుండెగోసి యరచే నిడినం
    దలపొడుగు ధనము బోసిన
    వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ!
    తాత్పర్యం: దుస్సాధ్యమైన పులిపాలు తెచ్చి ఇచ్చినా, హృదయాన్ని కోసి అరచేతిలో పెట్టినా, నిలువెత్తు ధనం పోసినా వేశ్యకు నిజమైన ప్రేమ ఉండదు.

    పుత్రోత్సాహము తండ్రికి
    పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
    పుత్రుని కనుగొని పొగడగ
    పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
    తాత్పర్యం: కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుడ్ని మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుంది.

    పురికిని బ్రాణము కోమటి
    వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
    గరికిని బ్రాణము తొండము
    సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ!
    తాత్పర్యం: ఈ లోకంలో పట్టణానికి వైశ్యుడు, వరిసస్యమునకు నీళ్లు, ఏనుగుకు తొండము, ఐశ్వర్యానికి స్త్రీ జీవం ఒసంగుదురు.

    పిలువని పనులకు బోవుట
    కలయని సతి రతియు రాజు గానని కొలువు
    బిలువని పేరంటంబును
    వలవని చెలిమియును జేయవలదుర సుమతీ
    తాత్పర్యం: పిలవని కార్యక్రమాలకు వెళ్లడం, హృదయంతో కలవని స్త్రీతో సంభోగం, పాలకులు చూడని సేవ, పిలవని పేరంటం, కోరని స్నేహం చేయదగదు.

    పాలసునకైన యాపద
    జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ
    దే లగ్నిబడగఁ బట్టిన
    మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!
    తాత్పర్యం: తేలు నిప్పులో పడినప్పుడు దానిని జాలితో బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది. కానీ మనం చేసే మేలును తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖునికి ఆపదలో సహాయం చేయజూస్తే తిరిగి మనకే ఆపకారం చేస్తాడు. కనుక అట్లు చేయరాదు.

    పాలను గలిసిన జలమును
    బాలవిధంబుననే యుండుఁ బరికింపగ
    బాల చవిఁజెరచు గావున
    బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!
    తాత్పర్యం: పాలతో కలిసిన నీరు కూడా పైకి పాలలాగే కనపడుతుంది. పరిశీలిస్తే పాల రుచిని చెడగొడుతుంది. అలాగే, చెడ్డవారితో స్నేహం స్వగౌరవాన్ని కూడా పోగొట్టును. కనుక అలాంటి స్నేహం వలదు.

    పాటెరుగని పతికొలువును
    గూటంబున కెరుకపడని కోమలిరతియు
    జేటెత్తజేయు చెలిమియు
    నేటికి నెదిరీదినట్టు లెన్నగ సుమతీ
    తాత్పర్యం: శ్రమను తెలుసుకోలేని ప్రభువును సేవించడం, కలయికకు తెలివిలేని స్త్రీతో సంభోగం, వెంటనే చెడిపోయేట్లున్న స్నేహం నదీ ప్రవాహానికి ఎదురీదినట్లే.

    పలుదోమి సేయు విడియము
    తలగడిగిన నాఁటినిద్ర తరుణులయెడలం
    బొలయలుక నాటి కూటమి
    వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!
    తాత్పర్యం: దంతధావనం చేసుకుని, తలంటు పోసుకుని, తాంబూలం వేసుకుని పోయిన నిద్ర, స్త్రీలతో ప్రణయకలహం వచ్చిన రోజు పొందు అత్యంత సౌఖ్యప్రదాలు. వాటి విలువ ఇంతని చెప్పలేము.

    పర్వముల సతులఁ గవయకు
    ముర్వీశ్వరుకరుణ నమ్మి యబ్బకు మదిలో
    గర్వింపనాలి బెంపకు
    నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ
    తాత్పర్యం: పుణ్యదినాల్లో స్త్రీలతో కలవకుము. ప్రభువుల దయను నమ్మి మనసులో ఉప్పొంగకుము. గర్వంతో విర్రవీగే భార్యను పోషింపకు. సాగుదల లేనిచోట నిలవకు.

    పరుల కనిష్టము సెప్పకు
    పొరుగిండ్లకు బనులులేక పోవకు మెపుడున్
    బరుఁగదిసిన సతి గవయకు
    ఎరింగియు బిరుసై సహయము నెక్కకు సుమతీ!
    తాత్పర్యం: ఇతరులకు అప్రియములను పలకవద్దు. పనులు లేక పొరుగిళ్లకు పోవద్దు. ఎప్పుడూ ఇతరులు పొందిన భార్యను కలివవద్దు. తెలిసీ, పొగరుబోతైన గుర్రాన్ని ఎక్కవద్దు.

    పరసతుల గోష్టినుండి
    పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్
    బరుసతి సుశీయైనను
    బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!
    తాత్పర్యం: భూమిపై, పర స్త్రీలతో సరససల్లాపాలు ఆడితే భీష్ముడయినా నిందను ఎదుర్కొనవలసిందే. ఇతర స్త్రీ ఎంత మంచిదయినా పర పురుషునితో స్నేహం చేస్తే అపకీర్తి పాలగును.

    పరసతి కూటమి గోరకు
    పరధనముల కాసపడకు పరునెంచకుమీ
    సరిగాని గోష్టి సేయకు
    సిరిచెడి జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ!
    తాత్పర్యం: ఇతర స్త్రీలతో కలయికను కోరవద్దు. ఇతరుల భాగ్యానికి ఆశపడకు. ఇతరుల దోషాలను లెక్కించవద్దు. మంచిది కాని సంభాషణ చేయవద్దు. భాగ్యం పోయినప్పుడు బంధువుల వద్దకు చేరకుము.

    పరనారీ సోదరుఁడై
    పరధనముల కాసపడక పరులకు హితుడైఁ
    పరుల దనుఁబొగడ నెగడక
    పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ!
    తాత్పర్యం: ఇతర స్త్రీలను తోబుట్టువులుగా చూసుకొంటూ, ఇతరుల ధనానికి ఆశపడకుండా, అందరికీ ఇష్టుడై, ఇతరులు పొగుడుతుంటే ఉప్పొంగక, కోపం ప్రదర్శించినప్పుడు బాధ పడకుండా ఉండేవాడే శ్రేష్టుడు.

    పనిచేయునెడల దాసియు
    ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
    దనభుక్తి యెడలఁ దల్లియు
    ననఁ దన కులకాంత యుండనగురా సుమతీ!
    తాత్పర్యం: భార్య… ఇంటిపనుల్లో దాసిగా, సంభోగ సమయంలో రంభగా, సలహాలిచ్చేటప్పుడు మంత్రిగా, భోజనం పెట్టే సమయంలో తల్లిగా ప్రవర్తించేలా ఉండాలి.

    పతికడకుఁ దన్నుగూర్చిన
    సతికడకును వేల్పుకడకు సద్గురు కడకున్
    సుతుకడకు రిత్తచేతుల
    మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ!
    తాత్పర్యం: ప్రభువు వద్దకు, భార్య దగ్గరికి, భగవంతుని సన్నిధానానికి, గురువు వద్దకు, కుమారుని దగ్గరకు బుద్ధిమంతులు వట్టిచేతులతో వెళ్లరు. ఇదియే నీతిమార్గము.

    పగవల దెవ్వరితోడను
    వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
    దెగనాడవలదు సభలను
    మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!
    తాత్పర్యం: భూమిపై ఎవరితోనూ విరోధం మంచిది కాదు. దార్రిద్య్రం వచ్చిన తరువాత విచారింపరాదు. సభలో ఎవరినీ దూషింపరాదు. స్త్రీకి తన హృదయాన్ని తెలియనీరాదు.

    నవ్వకుమీ సభలోపల
    నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్
    నవ్వకుమీ పరసతితో
    నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!
    తాత్పర్యం: సభల్లో, తల్లిని, తండ్రిని, భర్తను, ఇతరుల భార్యను, బ్రాహ్మణులను చూసి నవ్వరాదు.

    నవరస భావాలంకృత
    కవితాగోష్ఠియును మధుర గానంబును
    నవివేకి కెంతఁజెప్పినఁ
    జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!
    తాత్పర్యం: తొమ్మిది రసాలతోకూడిన మంచి భావాలతో శృంగారింపబడిన కవిత్వ సంబంధ సంభాషణ, కమ్మని సంగీతాన్ని జ్ఞానహీనునకు వినిపించడం, చెవిటి వాని ముందు శంఖం వూదినట్లే.

    నరపతుల మేరదప్పిన
    దిర మొప్పగ విధవ ఇంట దీర్పరియైనన్
    గరణము వైదికుఁడయినను
    మరణాంతకమౌనుగాని మానదు సుమతీ!
    తాత్పర్యం: రాజు హద్దుమీరి ప్రవర్తించినా, శాశ్వతంగా విధవ ఇంట పెత్తందారైనా, లేఖకుడు నియోగి కాక వైదికుడయినా ప్రాణము మీదికి వచ్చును. తథ్యము.

    నవమున బాలుంద్రావరు
    భయమునను విషమ్మునైన భక్షింతురుగా
    నయమెంత దోసకారియె
    భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!
    తాత్పర్యం: మెత్తని మాటలతో పాలు కూడా తాగరు. భయపెడితే విషాన్నైనా తాగుతారు. మృదుత్వమెప్పుడూ చెడునే కలిగిస్తుంది. కనక చక్కగా భయాన్నే చూపవలయును.

    నమ్మకు సుంకరి జూదరి
    నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్
    నమ్మకు మంగలివానిని
    నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!
    తాత్పర్యం: పన్నులు వసూలు చేసే వానిని, జూదం ఆడేవాడిని, కమసాలివానిని, నటకుని, వేశ్యను, వర్తకుని, ఎడమ చేతితో పనులు చేసేవాడిని నమ్మవద్దు.

    నడువకుమీ తెరువొక్కటఁ
    గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్
    ముడువకుమీ పరధనముల
    నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!
    తాత్పర్యం: తోడులేకుండా వంటరిగా పోవద్దు. విరోధి ఇంట్లో భుజింపవద్దు. ఇతరుల ధనం దగ్గర ఉంచుకోవద్దు. ఇతరుల మనస్సు బాధపడేట్లు మాట్లాడవద్దు. *ధీరులకుఁ జేయు మేలది
    సారంబగు నారికేళ సలిలము భంగిన్
    గారవమును మరిమీదట
    భూరిసుఖావహము నగును భువిలో సుమతీ!
    తాత్పర్యం: బుద్ధిమంతుడికి చేసే మేలు కొబ్బరికాయలోని నీరు వలే శ్రేష్టమైనది, ప్రియమైనది, గొప్ప సుఖానికి స్థానాన్ని ఇచ్చేదీ అగును.

    ధనపతి సఖుఁడై యుండియు
    నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్
    దనవారి కెంతకల గిన
    దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ!
    తాత్పర్యం: గొప్ప ధనవంతుడైన కుబేరుడు మిత్రడుగా ఉన్నా శివునికి బిచ్చం ఎత్తవలసి వచ్చింది. కనుక తాను సంపాదించుకున్న (తన దగ్గరున్న) భాగ్యమే తనకు సహాయపడాలి గానీ తన దగ్గర ఉన్నవారి దగ్గర ఎంత భాగ్యం ఉన్నా నిష్ప్రయోజనం

    చేతులకు దొడవు దానము
    భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో
    నీతియ తొడ వెవ్వారికి
    నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!
    తాత్పర్యం: చేతులకు దానం, పాలకులకు అసత్యం పలకకుండడం, అందరికీ న్యాయం, స్త్రీకి అభిమానం అలంకారాలు.

    దగ్గర కొండెము సెప్పెడు
    ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మరితా
    నెగ్గుఁబ్రజ కాచరించుట
    బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతీ!
    తాత్పర్యం: మంత్రి చెప్పే చాడీ మాటలకు లోబడి మంచిచెడ్డలు తెలుసుకొనక రాజు ప్రజలను హింసించడం బొగ్గుల కోసం కోరిన కోరికలిచ్చే కల్పవృక్షాన్ని నరికేసుకోవడం వంటిది.

    తాను భుజింపని యర్థము
    మానవపతిఁ జేరుఁగొంత మరి భూగతమౌఁ
    గానల నీఁగల గూర్చిన
    దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ!
    తాత్పర్యం: అరణ్యంలో తేనెటీగలు కూడబెట్టిన తేనె కడకి తరుల పాలైనట్లు లోభి నోరు కట్టుకొని కూడబెట్టిన ధనం కొంత ప్రభువుల పాలును, మరికొంత భూమి పాలగును.

    తలమాసిన నొలుమాసిన
    వలువలు మాసినను బ్రాన వల్లభునైనం
    గులకాంతలైన రోఁతురు
    తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ!
    తాత్పర్యం: భూలోకంలో… తలమాసినా, శరీరానికి మురికి పట్టినా, మట్టలు మాసిపోయినా చేసుకొన్న భర్తనయినా ఇల్లాళ్లు ఏవగించుకుంటారు.

    తలనుండు విషము ఫణికిని
    వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
    దలతోఁక యనక యుండును
    ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
    తాత్పర్యం: పాముకి విషము తలలోను, తేలుకు తోకలోనూ, దుష్టునకు నిలువెల్లా విషం ఉంటుంది.

    తములము వేయని నోరును
    విమతులతో జెలిమిసేసి వెతఁబడు తెలివిన్
    గమలములు లేని కొలకుఁను
    హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!
    తాత్పర్యం: తాంబూలం వేయని నోరు, దుర్మార్గులతో స్నేహం చేసి బాధపడే బుద్ధి, తామరపూలు లేని చెరువు, చంద్రుడు లేని రాత్రి శోభిల్లవు.

    తనవారు లేనిచోటను
    జనవించుక లేనిచోట జగడముచోటన్
    అనుమానమైన చోటను
    మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ!
    తాత్పర్యం: కావాల్సిన చుట్టాలు లేనిచోట, మాట చెల్లుబడికాని ప్రదేశంలో, తగవులాడుకొనేచోట, తనను అవమానించే ప్రదేశాల్లో మానవుడు నిలువరాదు.

    తన కలిమి ఇంద్రభోగము
    తన లేమియె సర్వలోక దారిద్య్రంబున్
    తన చావు జతద్ప్రళయము
    తను వలచినదియె రంభ తథ్యము సుమతీ!
    తాత్పర్యం: తన ఐశ్వర్యమే దేవలోక వైభవం; తన దారిద్య్రమే సమస్తలోక దారిద్య్రం; తన చావే ప్రపంచానికి ప్రళయం; తాను ప్రేమించినదే రంభ; మనుషులు భావించేది ఈ విధంగానే… ఇది నిజము.

    తనయూరి తపసితనమును
    దనపుత్త్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్
    దన పెరటిచెట్టు మందును
    మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ!
    తాత్పర్యం: తన ఊరివాళ్ల తపోనిష్ఠ, కుమారుని విద్యాధిక్యత, భార్య సౌందర్యం, ఇంటి వైద్యాలను ఎవ్వరూ కూడా గొప్పగా వర్ణించి చెప్పరు.

    తన కోపమె తన శతృవు
    తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ
    తన సంతోషమె స్వర్గము
    తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!
    తాత్పర్యం: తన కోపమే తనకు శతృవువలే బాధించును. తన శాంతమే తనను రక్షించును. దయయే చుట్టాలవలే సాయపడును. ఆనందమే ఇంద్రలోక సౌఖ్యము. దుఃఖమే నరకం అగును. ఇది నిజం.

    తడ వోర్వక యొడలోర్వక
    కడువేగం బడచిపడినఁ గార్యంబగునే
    తడవోర్చిన నొడలోర్చినఁ
    జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!
    తాత్పర్యం: ఆలస్యాన్ని, శరీర శ్రమను సహించకుండా తొందరపడినా కార్యం కాదు. ఆలస్యాన్ని, శరీర శ్రమను ఓర్చుకొన్నప్పుడే చెడిపోయిన కార్యం కూడా నెరువేరుతుండును.

    చేతులకు దొడవు దానము
    భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో
    నీతియ తొడ వెవ్వారికి
    నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!
    తాత్పర్యం: చేతులకు దానం, పాలకులకు అసత్యం పలకకుండడం, అందరికీ న్యాయం, స్త్రీకి అభిమానం అలంకారాలు.

    చుట్టములు గానివారలు
    చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్
    నెట్టుకొని యాశ్రయింతురు
    గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!
    తాత్పర్యం: ధనం ఎక్కువగా ఉన్నట్లయితే బంధువులు కాని వారు కూడా మేము మీకు బంధువులమే అంటూ పట్టుదలతో గట్టిగా మనల్ని ఆశ్రయించడానికి వస్తారు.

    కొరగాని కొడుకు పుట్టినఁ
    కొరగామియె కాదు తండ్రి గుణముల జెరచుం
    జెరకు తుద వెన్నుఁపుట్టిన
    జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!
    తాత్పర్యం: చెరకుగెడ చివర వెన్ను పుడితే అది చెరకులోని తీయదనాన్ని ఏ విధంగా పాడు చేస్తుందో అలాగే అప్రయోజకుడైన కుమారుడు పుట్టడం వల్ల ఆ కుటుంబానికి ఉపయోగ పడకపోగా తండ్రికి ఉన్న మంచి పేరును కూడా చెడగొడతాడు.

    కోమలి విశ్వాసంబును
    బాములతోఁ జెలిమి యన్యభామల వలపున్
    వేముల తియ్యఁదనంబును
    భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ!
    తాత్పర్యం: స్త్రీల పట్ల విశ్వాసం, పాములతో స్నేహం, పరస్త్రీల ప్రేమ, వేప చెట్లలో తీయదనం, రాజుల పట్ల నమ్మకం అన్నీ అసత్యాలు.

    గడనగల మననిఁజూచిన
    నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో
    గడ నుడుగు మగనిఁ జూచిన
    నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!
    తాత్పర్యం: స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు.

    చీమలు పెట్టిన పుట్టలు
    పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్
    హేమంబుఁ గూడఁబెట్టిన
    భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!
    తాత్పర్యం: చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లు అజ్ఞాని కూడబెట్టిన బంగారమంతా రాజుల వశమై పోతుంది.

    • కులకాంత తోడ నెప్పుడుఁ

    గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
    కలకంఠి కంట కన్నీ
    రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!
    తాత్పర్యం: భార్యతో ఎప్పుడూ తగాదా పడవద్దు. ఆమెపై లేనిపోని నేరాలను ఆరోపించవద్దు. ఉత్తమ ఇల్లాలు కంట నీరు కింద పడిన ఇంటిలో లక్ష్మిదేవి ఉండదు.

    కూరిమిగల దినములలో
    నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా
    కూరిమి విరసంబైనను
    నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!
    తాత్పర్యం: పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో నేరాలు ఎప్పుడూ కనిపించవు. ఆ స్నేహం చెడగానే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. ఇది నిజం.

    కొంచెపు నరుసంగతిచే
    నంచితముగఁ గీడువచ్చు నదియెట్లన్నన్
    గించిత్తు నల్లి కుట్టిన
    మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!
    తాత్పర్యం: చిన్న నల్లి కుడితే… ఆ నల్లి ఉన్న మంచాన్ని ఎండలో వేయడం, కర్రతో కొట్టడం, మరుగునీళ్లు పోయడం మొదలైన వన్నీ చేస్తాం. నల్లితో స్నేహం చేయడం వల్లే మంచానికే ఈ కష్టాలు. అలాగే అల్పుడైన వాడితో స్నేహం చేస్తే ఎలాంటి వారికైనా ఆపదలు వస్తాయి.

    కారణములేని నగవును
    బేరణమును లేని లేమ పృథివీస్థలిలో
    బూరణము లేని బూరెయు
    వీరణములేని పెండ్లి వృధరా సుమతీ!
    తాత్పర్యం: కారణం లేని నవ్వు, నృత్యం (రవిక) లేని స్త్రీ, పూర్ణం లేని బూరె, వీరణం లేని పెళ్లి వ్యర్థాలు.

    కాముకుడు దనిసి విడిచిన
    కోమలి బరవిటుడు గవయ గూడుట యెల్లన్
    బ్రేమమున జెరకు పిప్పికి
    జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ!
    తాత్పర్యం: విటుడు తృప్తిపడేట్లు భోగించి విడిచన కాంతను మరొకడు జారుడు అనుభవించాలని కోరడం చెరకులోని రసాన్ని సంపూర్ణంగా తీసివేసిన తరువాత పిప్పికై చీమలు ముసుకొన్నట్లు ఉండును.

    కాదు సుమీ దుస్సంగతి
    పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్
    వాదుసుమీ యప్పిచ్చుట
    లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!
    తాత్పర్యం: చెడ్డవారితో స్నేహం మంచిది కాదు. కిర్తి వచ్చిన తరువాత అది నశించదు. అప్పు తీసుకోవడం తగవులకు మూలం. స్త్రీల వద్ద ప్రేమ శూన్యం.

    కవిగానివాని వ్రాఁతయు
    నవరసభావములు లేని నాతుల వలపుం
    దవిలి చను పందినేయని
    వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ!
    తాత్పర్యం: కవి కానివాడు రాసిన రచన, తొమ్మిది రసాల స్థితులు తెలియని స్త్రీ ప్రేమ, ముందుపోయే పందిని వెంబడించి కొట్టలేని వాని ఆయుధ విద్యలోని నేర్పరితనం వ్యర్థం.

    కసుగాయఁ గరచి చూచిన
    మసలక తన యోగరుగాక మధురంబగునా?
    పసగలుగు యువతులుండఁగఁ
    బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ!
    తాత్పర్యం: పక్వానికి వచ్చిన పళ్లను వదిలి పచ్చికాయలను తింటే వగరుగా ఉన్నట్లే, చాతుర్యం గల పడుచులు ఉండగా పసిపాపలను కూడెడు వానికి సుఖము శూన్యము. అలాంటివాడు నిజంగా పశువే.

    కరణము సాధై యున్నను
    గరి మద ముడిగినను బాము కరవకయున్నన్
    ధరదేలు మీటకున్నను
    గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!
    తాత్పర్యం: కరణం నెమ్మదస్తుడైనా, ఏనుగు మదం పోయినది అయినా, తాచుపాము కరవకున్నా, తేలు కుట్టకున్నా ఆశ్చర్యంతో మిక్కిలి తేలికగా చూస్తారు.

    కరణము గరణము నమ్మిన
    మరణాంతకమౌను గాని మనలేడు సుమీ
    కరణము తన సరి కరణము
    మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!
    తాత్పర్యం: ఒక లేఖకుడు మరో లేఖకుని నమ్మితే మరణంతో సమానమైన ఆపదను కొనితెచ్చుకున్నట్లే. అందుకే, లేఖకుడు తనతో సమానమైన మరో లేఖరిని విశ్వసింపక, తన గుట్టును చెప్పక జీవించాలి.

    కమలములు నీడఁ బాసినఁ
    గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్
    దమ దమ నెలవులు దప్పినఁ
    దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!
    తాత్పర్యం: కమలములు పుట్టిల్లయిన నీటిని విడిచిపెట్టి మిత్రుడు అయిన సూర్యుని ఎండ తాకిన వెంటనే కమిలిపోతున్నాయి. అలాగే, మానవులు తమ నివాసాలను విడిచిపెడితే స్నేహితులే శతృలవుతారు.

    కప్పకు నొరగాలైనను
    సప్పమునకు రోగమైన సతి తులువైనన్
    ముప్పున దరిద్రుడైనను
    దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!
    తాత్పర్యం: కప్పకు కాలు విరిగినా, పాముకు రోగం వచ్చినా, భార్య దుష్టురాలైనా, ముసలితనంలో దారిద్య్రం సంభవించినా ఎక్కువ దుఃఖప్రదాలు అవుతాయి.

    కనకపు సింహాసనము
    శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ
    దొనరఁగ బట్టముగట్టిన
    వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!
    తాత్పర్యం: శుభ ముహూర్తంలో కుక్కను తీసుకొచ్చి బంగారు సంహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా, దాని నిజనైజాన్ని ఎలా మానలేదో అల్పునికి ఎంత గౌరవం చేసి మంచి పదవి ఇచ్చినా తన నీచత్వాన్ని వదలలేడు.

    కడు బలవంతుడైనను
    బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం
    దడవుండనిచ్చె నేనియు
    బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!
    తాత్పర్యం: ఎంత సమర్థత కలవాడైనా యవ్వనంలో భార్యను చిరకాలం పుట్టింట ఉండనిచ్చినచో తానే స్వయంగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును.

    ఓడల బండ్లును వచ్చును
    ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును
    ఓడలు బండ్లును వలెనే
    వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!
    తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చునట్లే, భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం పర్యాయంగా వస్తూంటాయి.

    ఒల్లనిసతి నొల్లనిపతి
    నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
    గొల్లండు గాక ధరలో
    గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!
    తాత్పర్యం: తన్ను ప్రేమించని భర్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు.

    ఒకయూరికి నొక కరణము
    నొక తీర్పరియైనఁ గాక వొగిఁదరుచైనం
    గకవికలు గాక యుండునె
    సకలంబును గొట్టువడక సహజము సుమతీ!
    తాత్పర్యం: ఒక గ్రామానికి ఒక లేఖరి, ఒక ధర్మాధికారి ఉండాలి. అలాకాక ఎక్కువమంది అయితే అనేక గందరగోళాలు పుట్టి సమస్తం చెడిపోవుట సహజము.

    ఏరకుమీ కసుగాయలు
    దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ
    పారకుమీ రణమందున
    మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
    తాత్పర్యం: భూమిపై… పచ్చికాయలు ఏరి తినకు. చుట్టాలను దూషించకు. యుద్ధం నుంచి వెనుతిరిగి పారిపోకు. పెద్దల ఆజ్ఞలను జవదాటకు సుమా!

    ఎప్పుడు సంపద కలిగిన
    అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
    దెప్పలుగ జెరువునిండిన
    గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
    తాత్పర్యం: చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు.

    ఎప్పుడు దప్పులు వెదకెడు
    నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్
    సర్పంబు పడగనీడను
    గప్పవసించిన విధంబు గదరా సుమతీ!
    తాత్పర్యం: నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికే యజమానిని సేవిచే వాడి బతుకూ ప్రాణభయంతో కూడినదే సుమా!

    ఉపకారికి నుపకారము
    విపరీతముగాదు సేయ వివరింపంగా
    అపకారికి నుపకారము
    నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
    తాత్పర్యం: మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి.

    ఉదకము ద్రావెడు హయమును
    మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
    మొదవుకడ నున్న వృషభము
    జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!
    తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, కొవ్వుతో విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్న ఆబోతు వద్దకు, విద్యనేర్వని అల్పుని దగ్గరకు వెళ్లకుము.

    ఉత్తమ గుణములు నీచు
    కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా
    నెత్తిచ్చి కరగిపోసిన
    నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ!
    తాత్పర్యం: బంగారానికి సమానమైన ఎత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించిపోసినా బంగారం ఎట్లు కానేరదో అదేవిధంగా లోకంలో నీచునకు ఎక్కడా ఏ విధంగానూ మంచి గుణాలు కలగవు.

    ఉడుముండదె నూరేండ్లును
    బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్
    మడుపునఁ గొక్కెర యుండదె
    కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!
    తాత్పర్యం: ఉడుము నూరేళ్లు, పాము పది వందల ఏళ్లు, కొంగ చెరువులో చిరకాలం జీవిస్తున్నాయి. వాటి జీవితాలన్నీ నిరుపయోగాలే. మానవుని జీవితం అలా కాక ధర్మార్థకామమోక్షాసక్తితో కూడినది కావాలి.

    ఇమ్ముగఁ జదువని నోరును
    అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్
    దమ్ములఁ బిలువని నోరును
    గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
    తాత్పర్యం: ఇంపుగా పఠింపని నోరు, అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు, తమ్ముడూ అని పిలవని నోరు కుమ్మరివాడు మన్ను తవ్విన గోయితో సమానం సుమా!

    ఆఁకొన్న కూడె యమృతము
    తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
    సోఁకోర్చువాఁడె మనుజుఁడు
    తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!
    తాత్పర్యం: లోకంలో ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము, బాధ పొందకుండా ఇచ్చువాడే దాత, ఆవేశాన్ని ఓర్చుకొనేవాడే మానవుడు, ధైర్యం కలవాడే వంశశ్రేష్ఠుడు.

    అల్లుని మంచితనంబును
    గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
    బొల్లున దంచిన బియ్యముఁ
    దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
    తాత్పర్యం: అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ఞానం, ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ లోకములో ఉండవు.

    అప్పుగొని సేయు విభవము
    ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
    దప్పురయని నృపురాజ్యము
    దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ!
    తాత్పర్యం: రుణము తెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనంలో పడుచు భార్య, తప్పులను కనిపెట్టని రాజు రాజ్యము సహింపరానివి. చివరకు హాని కలిగించేవి.

    అడియాస కొలువుఁ గొలువకు
    గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్
    విడువక కూరిమి సేయకు
    మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!
    తాత్పర్యం: వృథా ప్రయాస అగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయం లేకుండా ఒంటరిగా పోకుము.

    అడిగిన జీతంబియ్యని
    మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్
    వడిగల యెద్దుల గట్టుక
    మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!
    తాత్పర్యం: అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకుని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది.

    అక్కరకు రాని చుట్టము
    మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
    నెక్కినఁ బారని గుర్రము
    గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
    తాత్పర్యం: అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.

    శ్రీరాముని దయచేతను
    నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
    ధారాళమైన నీతులు
    నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!
    తాత్పర్యం: మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Josyula
    • Website

    Related Posts

    బ్రహ్మ విష్ణు మహేశ్వర – ఈ క్రమమే ఎందుకు? జీవితం చెప్పే సమాధానం

    July 14, 2026

    దక్షిణాయనం – 16 జూలై 2026 నుండి 15 జనవరి 2027 వరకు

    July 13, 2026

    ద్వాదశాదిత్యులు ఎవరు? / Who are the Dwadashādityas?

    June 7, 2026

    Comments are closed.

    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (105)
    • అష్టోత్తరం (44)
    • డౌన్లోడ్స్ (1)
    • దేవాలయాలు (17)
    • దేవి మహాత్మ్యం (18)
    • పూజ (15)
    • భక్తి (164)
    • భగవత్ గీత (19)
    • మన పండుగలు (33)
    • ముఖ్యం (1)
    • విజ్ఞానం (23)
    • స్తోత్రాలు (63)
    Demo
    Don't Miss

    sample

    JosyulaAugust 23, 2026

    To understand the new smart watched and other pro devices of recent focus, we should…

    శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

    August 17, 2026

    శ్రీ వరలక్ష్మీ వ్రతం – శుక్రవారం, 21, 28 ఆగస్టు, 2026

    August 17, 2026

    సూర్యగ్రహణం – బుధవారం, 12 ఆగస్టు 2026

    August 12, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.